TTD : ఇటీవల తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబాతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం సమావేశం అయిన బీఆర్ నాయుడు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సిఫార్సు లేఖలు తీసుకునేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పినట్లు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు.. మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ లేఖలు దుర్వినియోగం కాకుండా పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు, 17 ఎంపీల లేఖలు చెల్లుబాటు అవుతాయి.
కాగా, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల ఎంపీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుకోవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అయితే టీటీడీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.