తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణానికి అనుకూలమైన గాలి వీచేలా ఏర్పాట్లు చేయబోతోంది. దీనికోసం పాత ఫ్యాన్లను తీసేసి.. కొత్త బీఎల్డీసీ ఫ్యాన్లను అమర్చబోతోంది. గెస్ట్ హౌస్ లు, ఆఫీసులలోనూ కొత్త ఫ్యాన్లను అమర్చుతారు. ఇవి మెరుగ్గా పనిచేయడంతోపాటు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని టీటీడీ చెబుతోంది. టీటీడీ చెబుతున్న బీఎల్డీసీ ఫ్యాన్స్ అంటే.. బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ఫ్యాన్స్ అని అర్థం.
తిరుమలను పర్యావరణ హితంగా, ఇంధన పొదుపు నిలయంగా మార్చాలని టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే 5000 బీఎల్డీసీ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తుంది. అన్నప్రసాదం కేంద్రాలతోపాటు, భక్తుల కాంప్లెక్స్ లు, చౌట్రీలు, రెస్ట్ హౌస్ లు, కల్యాణకట్ట.. ఇంకా ఇతర చోట్ల వీటిని ఏర్పాటుచేయబోతోంది. పాత ఫ్యాన్లను అమర్చి ఇప్పటికే పదేళ్లు దాటిపోవడంతో టీటీడీ.. ఇప్పుడు కొత్త ఫ్యాన్లను బిగించబోతోంది.
ఐదు వేల ఫ్యాన్లను అమర్చడం ద్వారా ఏటా దాదాపు 40 లక్షల రూపాయిలు ఆదా అవుతాయని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ ఫ్యాన్ల కొనుగోలు కోసం బోర్డు రూ.1.38 కోట్లను మంజూరు చేసింది. టీటీడీ భవనాలతోపాటు దాని ఆలయాల్లో ఇంధన పొదుపునకు సంబంధించి.. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఇప్పటికే సర్వేలు చేసింది. కొన్ని సూచనలు కూడా చేసింది.
విద్యుత్ కు సంబంధించి హెచ్.టి.సర్వీసులను 0.97 పైన నిర్వహించాలంటే.. సాధారణ ట్యూబ్ లైట్లు, వీధిదీపాలకు బదులు.. ఎల్ఈడీ లైట్లను ఉపయోగించాలని చెప్పింది. 1, 2, 3 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలకు బదులు 5 స్టార్ రేటింగ్ ఉన్నవాటిని వినియోగించాలని సిఫార్స్ చేసింది. మామూలు సీలింగ్ ఫ్యాన్స్ కు బదులు.. బీఎల్డీసీ ఫ్యాన్లను అమర్చాలని చెప్పింది. దీంతో ఈ ఫ్యాన్లను ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫీషియన్సీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా కొనుగులు చేయనుంది.
ఏపీఎస్ఎస్ఈడీసీఓ తో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అగ్రిమెంట్ ఉన్న కాలంలో.. పాత సీలింగ్ ఫ్యాన్లకు బదులు బీఎల్డీసీ ఫ్యాన్లను అమర్చుతుంది. వారంటీ ఉన్న సమయంలో ఏవైనా మరమ్మతులు వచ్చినా.. ఫిర్యాదు చేసిన రోజు నుంచి ఏడు పనిదినాలలలో సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ మరమ్మతులు సాధ్యం కాకపోతే కొత్త ఫ్యాన్లను అందిస్తారు.