Site icon HashtagU Telugu

Trump Tariff Impact: అమెరికా టారిఫ్‌లతో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై భారీ దెబ్బ!

Trump Tariff Impact

Trump Tariff Impact

Trump Tariff Impact: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల (Trump Tariff Impact) ప్రభావం భారత్‌పై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై తీవ్రంగా పడింది. రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ టారిఫ్‌ల కారణంగా రొయ్యల ఎగుమతులపై సుమారు రూ. 25,000 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న ఎగుమతి ఆర్డర్‌లలో 50% రద్దు అయ్యాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. సుమారు 2,000 కంటైనర్ల ఎగుమతిపై రూ. 600 కోట్ల టారిఫ్ భారం పడింది.

నష్టం నివారణకు కేంద్రం సహాయం కోరిన చంద్రబాబు

ఈ సంక్షోభం నుంచి రైతులను, ఎగుమతిదారులను గట్టెక్కించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరారు. గతంలో భారత్‌పై 25% బేస్‌లైన్ టారిఫ్ విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై 25% పెనాల్టీ విధించింది. దీనికి తోడు 5.76% ప్రతికూల సుంకం, 3.96% యాంటీ-డంపింగ్ సుంకం విధించడంతో మొత్తం అమెరికా టారిఫ్ 59.72%కి చేరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జల రైతులను కాపాడటానికి జీఎస్‌టీలో ఉపశమనం, ఆర్థిక ప్యాకేజీతో పాటు, నష్టాలను తగ్గించడానికి జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అలాగే దేశీయంగా జల ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: Little Hearts Box Office: సూపర్ హిట్ మూవీగా లిటిల్ హార్ట్స్.. 8 రోజుల్లో భారీగా వసూళ్లు!

ముగ్గురు కేంద్ర మంత్రులకు లేఖలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌లకు విడివిడిగా లేఖలు రాశారు. ఆర్థిక మంత్రిని జీఎస్‌టీ, ఆర్థిక సహాయంపై దృష్టి పెట్టాలని, వాణిజ్య & పరిశ్రమల మంత్రిని ఇతర దేశాలతో జల సంబంధిత ఒప్పందాలు చేసుకోవాలని, మత్స్యశాఖ మంత్రిని దేశీయ మార్కెట్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ దేశంలో రొయ్యల ఎగుమతిలో 80%, మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో 34% వాటాను కలిగి ఉందని సీఎం తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా రూ. 21,246 కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. ఈ టారిఫ్‌ల వల్ల దాదాపు 2.5 లక్షల జల రైతుల కుటుంబాలు, అనుబంధ రంగాలపై ఆధారపడిన 30 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉపశమన చర్యలు

ఈ సంక్షోభం నుంచి రొయ్యల ఎగుమతిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉపశమన చర్యలు ప్రారంభించిందని చంద్రబాబు తెలిపారు. ఫీడ్ ఉత్పత్తిదారులతో చర్చించి ఆక్వా ఫీడ్ గరిష్ట రిటైల్ ధరను కిలోకు రూ. 9 తగ్గించడంతో పాటు రాయితీతో కూడిన ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరాపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎగుమతిదారులు, ఆక్వా కంపెనీలకు రుణాల‌పై 240 రోజుల మారటోరియం, వడ్డీ రాయితీ, ఫ్రోజెన్ రొయ్యలపై 5% జీఎస్‌టీని తాత్కాలికంగా రద్దు చేయాలని బ్యాంకుల‌ను కోరారు.