TRS Vs Jagan : జ‌గ‌న్ పై టీఆర్ఎస్ `స్మార్ట్` ప్లే !

ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు తారుమారు కావ‌డానికి ఓట‌ర్ల మ‌న‌సును తాకే ఒక్క అంశం చాలు.

  • Written By:
  • Updated On - October 1, 2022 / 12:30 PM IST

ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు తారుమారు కావ‌డానికి ఓట‌ర్ల మ‌న‌సును తాకే ఒక్క అంశం చాలు. అందుకే, వ్య‌వ‌సాయ బావుల‌కు మోటార్ల అంశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ హైలెట్ చేస్తున్నారు. మోడీ స‌ర్కార్ పెట్టిన ఈ కండిష‌న్ ను ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జైకొట్టిన‌ప్ప‌టికీ తెలంగాణ స‌ర్కార్ నో చెప్పింద‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. ఉప ఎన్నిక‌ల నుంచి సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే అంశాన్ని ప్ర‌ధానంగా వినిపించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. మూడోసారి సీఎం కావ‌డానికి మోటార్ల అస్త్రాన్ని ఎంచుకున్నారు. కానీ, ఆ అస్త్రం మోడీతో పాటు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా తాకేలా కేసీఆర్ ప్ర‌యోగించ‌డం గ‌మ‌నార్హం.

శ్రీకాకుళం జిల్లాల్లో బోరు బావుల‌కు మోటార్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం బిగించింది. అక్క‌డ రైతాంగం నుంచి వ‌చ్చే వ్య‌తిరేకత ఆధారంగా మిగిలిన ప్రాంతాల్లోనూ మోటార్లు పెట్టాల‌ని ప్లాన్ చేశారు. ఆ మేర‌కు స్మార్ట్ మీట‌ర్ల‌ను రెడీ చేశామ‌ని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చెబుతున్నారు. ఉచిత విద్యుత్ కు మీట‌ర్లు ఎందుక‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ తొలి నుంచి ప్ర‌శ్నిస్తోంది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ స‌ర్కార్ దూకుడుగా ముందుకెళుతూ మీట‌ర్ల‌ను ఫిక్స్ చేస్తోంది. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి హ‌రీశ్ రావు ఏపీలోని మోటార్ల గురించి మాట్లాడ‌గానే ఆ అంశం హైలెట్ కావ‌డంతో పాటు రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది.

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి తీరుతామని విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఫ‌లితంగా క‌రెంట్ ఆదా అవుతుంద‌ని ఆయ‌న లాజిక్ చెబుతున్నారు. స‌రిగ్గా ఇదే పాయింట్ ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి లేవ‌నెత్తుతున్నారు. మీటరు పెడితే విద్యుత్ ఆదా ఎలా అవుతుందని ప్రశ్నించారు. 18లక్షల మీటర్లకు 4,500 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో కమిషన్ కోసం మీట‌ర్ల‌ను పెడుతున్నార‌ని రాష్ట్రప్రభుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. 12 గంటలు కరెంటు ఇస్తామని 5 గంటలకు తగ్గించారన్నారు. విద్యుత్తు మోటర్లకు మీటర్లు నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే వెనక్కు తీసుకుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. త్వరలో మరో 77వేల కనెక్షన్ లను ఇచ్చేందుకు సిద్ధంగా ప్ర‌భుత్వం ఉంద‌ని పెద్దిరెడ్డి చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి వందశాతం స్మార్ట్ మీటర్లు పెట్ట‌డాన్ని ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కార్ ఉంది. విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంద‌ని రివ‌ర్స్ యాంగిల్ చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) కోసం ఖాతాలను తెరిచారని, స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోందని జ‌గ‌న్ స‌ర్కార్ లెక్కిస్తోంది.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉద్య‌మించ‌డానికి ప‌దునైన అస్త్రం దొరికిన‌ప్ప‌టికీ టీడీపీ దూకుడుగా వెళ్ల‌లేక‌పోతోంది. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వంలోని మంత్రులు మాత్రం వైసీపీని ప‌దేప‌దే టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.