ట్రైబల్ మినిస్టర్ ఇలాకాలో అధ్వాన రోడ్లు.. మండిపడుతున్న గిరిజనులు!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రోడ్డుకి మరమ్మత్తులు చేయలేదు.ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారైంది

  • Written By:
  • Updated On - November 1, 2021 / 04:26 PM IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రోడ్డుకి మరమ్మత్తులు చేయలేదు.ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారైంది. అసలే ఆ గిరిజన గ్రామాలు ఇప్పటికి వెనుకబడి ఉన్నాయి.దీనికి తోడు రోడ్లు లేకపోవడంతో గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం ఏజెన్సీలోని బల్లుకోట గిరిజనులు తమ గ్రామం నుంచి 3.2 కి.మీ మేర కచ్చా రోడ్డు నిర్మాణాన్ని సొంతంగా చేపట్టారు. కురుపాం మండలం గొటివాడ గ్రామపంచాయతీ పరిధిలోని బల్లుకోటలో 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి.ఈ గ్రామంలో ప్రభుత్వం రోడ్లు వేస్తుందని వెయ్యి కళ్లతో చూసి చివరకు విసిగిపోయి గిరిజనులే రోడ్ల నిర్మాణానికి నడుం బిగించారు.గిరిజనులు తమ రోజువారీ అవసరాల కోసం బల్లుకోట నుండి కురుపాం చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రోడ్డు కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను బల్లుకోట నుండి సమీపంలోని ఆసుపత్రికి తరలించడం చాలా కష్టమైన పనిగా మారింది.తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరుతూ ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు .ఈ బల్లుకోట గ్రామం డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండే గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిచకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బల్లుకోట ఉప సర్పంచ్ కొండగొర్రి డిల్లేశ్వరరావు, వార్డు సభ్యుడు ఆరిక శ్రీనివాసరావు, ఇతర గ్రామ పెద్దలు చొరవ తీసుకుని బల్లుకోట నుంచి ‘కచ్చ’ రోడ్డును సొంతంగా నిర్మించారు.రోడ్డు నిర్మాణానికి గ్రామంలోని ప్రతి కుటుంబం రూ.100 ఆర్థిక సహాయం అందించారు. ఉప సర్పంచ్ ఇచ్చిన పిలుపు మేరకు మహిళలు, యువకులు సహా 150 మంది గిరిజనులు శ్రమదానం చేసేందుకు ముందుకు వచ్చి… రోడ్లపై చెట్లను తొలగించారు. రోడ్డు పనులకు సంబంధించిన మెటీరియల్ను రవాణా చేసేందుకు ట్రాక్టర్ను అద్దెకు తీసుకున్నారు. రోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు.

రోడ్డు నిర్మాణం కోసం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థకు, రాజకీయ నేతలకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా బల్లుకోటకు సరైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉప సర్పంచ్ డిల్లేశ్వరరావు ఆరోపించారు.అధికారుల ఉదాసీనతతో విసిగిపోయిన బల్లుకోట గిరిజనులు ప్రభుత్వం పనులు చేపట్టే వరకు వేచి చూడకుండా సొంతంగా రహదారిని నిర్మించాలని నిర్ణయించుకున్నారని… రాబోయే కొద్ది రోజుల్లో రహదారి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. బల్లుకోట గిరిజనులు చేపట్టిన చొరవతో ప్రభుత్వం ఇప్పుడు ‘కచ్చా’ రోడ్డును పక్కా రోడ్డుగా మారుస్తుందని ఆశిస్తున్నానని ఉప సర్పంచ్ తెలిపారు.