AP Kidney Patients : ఏ.కొండూరు కిడ్నీ బాధితుల్ని ఆదుకోండి.. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రికి గిరిజ‌న యువ‌కుల విన‌తి

ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండ‌లం మ‌రో ఉద్ధానంగా మారుతుంది. కిడ్నీ బారిన ప‌డిన ఇప్ప‌టికే...

  • Written By:
  • Updated On - September 13, 2022 / 11:29 PM IST

ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండ‌లం మ‌రో ఉద్ధానంగా మారుతుంది. కిడ్నీ బారిన ప‌డిన ఇప్ప‌టికే వంద‌ల సంఖ్య‌లో మృత్యువాత‌ప‌డ‌గా.. మ‌రికొంద‌రు వ్యాధితో బాధ‌ప‌డుతూ మంచాన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని గిరిజ‌న సంఘం నేత‌లు ఏపీలో ప‌ర్య‌టిస్తున్న కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడలో కలిసిన గిరిజన సంఘం నేతలు బి. గోపిరాజు , భరోతు పిక్లానాయక్ జె.బాలజీనాయక్ లు మంత్రిని క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏ కొండూరు మండలానికి శాస్త్రవేత్తలు బృందాన్ని పంపించాల‌ని. ఏ కొండూరు మండలంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాల‌ని మంత్రిని కోరారు.

ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో అధికంగా గిరిజనులను నివసిస్తున్నారని గత ఏడు సంవత్సరాల నుండి గిరిజనులతో పాటు దళితులు బీసీ మైనార్టీ వర్గాలు వారు ఫ్లోరైడ్ సిలికా ఉన్న నీటిని తాగి కిడ్నీ వ్యాధి భారిన ప‌డ్డార‌ని లేఖ‌లో వివ‌రించారు. దాదాపుగా 600 మంది పైగా చనిపోయారని ఇంకా ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధితో వందలాదిమంది బాధితులు ఉన్నారని ఈ ప్రాంతంలో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ పర్యటన తర్వాత కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ నుండి ఏ కొండూరు మండలానికి డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. కిడ్నీ సమస్య తీవ్రంగా ఉన్న ఏ కొండూరు మండలంలో కాకుండా ఇతర మండలానికి డయాలసిస్ సెంట‌ర్ ని తరలించారని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో బాధితులు దూర ప్రాంతానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఏ కొండూరు మండలంలో డ‌యాల‌సిస్ సెంట‌ర్ ని ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి రాకుండా ఆరికట్టడానికి మూలాలను కనుక్కోవాలని .. మ‌ర‌ణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ ని గిరిజన సంఘం నాయకులు కోరారు