Tribal Teen Rajitha: ఆదివాసీ ఆణిముత్యం ‘కుంజ రజిత’

ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌. అక్కడ పని దొరక్క పొట్ట చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు వలస వచ్చారు.

  • Written By:
  • Updated On - June 13, 2022 / 03:01 PM IST

ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌. అక్కడ పని దొరక్క పొట్ట చేతపట్టుకొని కుటుంబంతో సహా ఆంధ్రప్రదేశ్ కు వలస వచ్చింది. ఆదివాసీలు అంటేనే బతుకు దుర్భరం. ప్రభుత్వ ప్రోత్సహకాలు కూడా అంతంతమాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయస్థాయి క్రీడాకారిణిగా అదరగొట్టింది రజిత. ఇటీవలే హర్యానాలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2022 లో 400 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో రజిత స్వర్ణం సాధించింది. ఆమె కేవలం 56.07 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌కు పేరు తీసుకొచ్చింది. అయితే ఇది ఆమెకు మొదటి విజయం కాదు. అస్సాంలో జరిగిన 2019 ఖేలో ఇండియా ఎడిషన్‌లో రెండవ స్థానంలో నిలిచింది.

రజిత తల్లిదండ్రులు కూనవరం లోని పోచారం పంచాయతీ రామచంద్రపురానికి వలస వెళ్లారు. ఈ గ్రామం కూనవరం నుండి 130 కి.మీ దూరంలోని అల్లూరి జిల్లాగా ఉంటుంది. కూనవరం పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం కట్టెలు కొట్టేవాళ్లు. రజిత,  ఆమె ముగ్గురు అన్నదమ్ముళ్లు అడవుల నుండి కలపను సేకరిస్తూ తల్లిదండ్రులకు అండగా నిలబడేవాళ్లు.  తల్లిదండ్రులు కూడా మారయ్య, భద్రమ్మ తమ పిల్లల చదువుకోసం ఎంతగానో కష్టపడేవాళ్లు. తాము పస్తులుండి పిల్లలను చదివించేవాళ్లు.

ప్రతిరోజూ 10 కిలోమీటర్లు నడిచి చింతూరు బ్లాక్‌లోని కటుకపల్లిలోని స్కూల్‌కు చేరుకుంటారు. పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు మాత్రమే తరగతులు ఉండడంతో రజిత నెల్లూరులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ పొందింది. అక్కడి ఉపాధ్యాయులు రజితకు ట్రైనింగ్ ఇచ్చి క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. దీంతో ఆమె జిల్లా స్థాయి క్రీడాకారిణి నుండి జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా రజిత చెప్పింది.