Hyderabad To Vijayawada Road సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిర్మాణ పనులు, పండుగ రద్దీతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు.
- HYD-VJA హైవే ప్రయాణికులకు అలర్ట్
- అప్పుడే బారులు తీరిన వెహికల్స్
- ఈ రూట్లలో వెళితే ఈజీ జర్నీ
సంక్రాంతి పండుగ వేళ నగరం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) రద్దీగా మారింది. ఇవాళ ఉదయం నుంచే ఈ రహదారిపై ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం, పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. పండుగ సెలవులు ప్రారంభం కావడంతో వేలాది మంది జనం సొంతూళ్లకు తరలివెళ్తుండటం, మరోవైపు హైవేపై జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. టోల్ ప్లాజా వద్ద 3 సెకన్లకు ఒక వెహికల్ పాస్ అయ్యేలా ఏర్పాట్లు చేసినా.. రద్దీ తగ్గటం లేదు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులకు పోలీసులు ప్రత్యేక సూచన చేశారు. సాధారణంగా వీరంతా నార్కట్‌పల్లి వరకు వెళ్లి అద్దంకి జాతీయ రహదారి మీదుగా వెళ్తుంటారు. అయితే విజయవాడ హైవేపై ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్ మీదుగా వెళ్తే పంతంగి టోల్‌ప్లాజా వద్ద తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీనికి బదులుగా, హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్లడం ఉత్తమమని పోలీసులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా ప్రయాణించే వారు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని సాగర్ హైవేలోకి ప్రవేశించవచ్చు. ఇది కొంచెం ఎక్కువ దూరమైనప్పటికీ.. ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సాఫీగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు కూడా విజయవాడ హైవేకు బదులుగా భువనగిరి మీదుగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా ప్రయాణించి నేరుగా చిట్యాలకు చేరుకోవచ్చు. చిట్యాల నుంచి నార్కట్‌పల్లిని దాటేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వచ్చి ఘట్‌కేసర్ వద్ద ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు. లేదా సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించగలవని ట్రాఫిక్ పోలీసులు వివరిస్తున్నారు.
మరోవైపు ఆదివారం చౌటుప్పల్‌లో జరిగే వారంతపు సంత గురించి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆదివారం ఇక్కడ సంత జరగడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పండుగ రద్దీకి సంత వాహనాలు కూడా తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. అందువల్ల ఆదివారం ప్రయాణం చేసే వారు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మేలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు ఓపికతో వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
