Revanth Reddy : జ‌గ‌న్ కు బ్ర‌హ్మాస్త్రం ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఇర‌కాటంలో చంద్ర‌బాబు!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్ర‌హ్మాస్త్రాన్ని అందించారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడును ఇర‌కించేశారు.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 08:10 AM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్ర‌హ్మాస్త్రాన్ని అందించారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడును ఇర‌కించేశారు. బీజేపీ, టీడీపీ ద‌గ్గ‌ర‌వుతోన్న వేళ కాంగ్రెస్ పార్టీతో చంద్ర‌బాబుకు ఉన్న తెర‌వెనుక ఉన్న సంబంధాన్ని రేవంత్ రెడ్డి బ‌య‌ట‌పెట్టారు. ఏపీకి వెళ్లిన చంద్ర‌బాబు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చూసుకోమ‌ని పంపించాడ‌ని బ‌హిరంగ స‌భ‌లో చెప్పారు. ఇదే అంశాన్ని వైసీపీ రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన అస్త్రంగా మ‌లుచుకోవ‌డానికి సిద్ధం అవుతోంది.

పుట్టిల్లు అయిన తెలుగు దేశం నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి కోడ‌లిలా వ‌చ్చిన‌ట్టు రేవంత్ రెడ్డి మునుగోడు కేంద్రంగా వెల్ల‌డించారు. చంద్రబాబే తనను కాంగ్రెస్ లోకి పంపారంటూ, ఒకప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ మనిష‌ని గుర్తు చేశారు. ఆయ‌న‌ అప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసారని చెబుతూ తనను కాంగ్రెస్ లోకి పంపిండంలో తప్పేంటని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ. వ్యాఖ్య‌లే ఇప్పుడు చంద్ర‌బాబు మెడ‌కు రాజ‌కీయంగా చుట్టుకుంటున్నాయి.

2019 ఎన్నికల వేళ ప్రధాని మోదీతో విభేదించిన చంద్రబాబు నాడు కాంగ్రెస్ తో జత కలిసారు. ప్రధాని మోదీకి వ్యతిరేక పార్టీల నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో రాహుల్ ఇంటికి వెళ్లి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ, ఫలితాలు పూర్తిగా రివర్స్ అయిన విష‌యం విదిత‌మే.

ఆ తరువాత టీడీపీ సీనియర్లే చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలపటాన్ని చారిత్రాత్మక తప్పిదంగా పేర్కొన్నారు. ఆ పార్టీకి ప్ర‌స్తుతం దూరంగా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. జ‌న‌సేన‌తో పాటుగా బీజేపీ మద్దతు పొందే ప్రయత్నాలను ముమ్మరం చేసారు. ఇందుకోసం నెమ్మదిగా పావులు కదుపుతున్నారు. ఎక్కడా జాతీయ రాజకీయాలు, కాంగ్రెస్ మద్దతు అంశాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉంటున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ నిర్ణయాలను ప్రశంసిస్తున్న విష‌యాన్ని చూస్తున్నాం.

ఇప్పుడు రేవంత్ తనను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపారంటూ చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయంగా టీడీపీని ఇరుకున‌పెట్టేలా ఉన్నాయి. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ తో చంద్రబాబుకు ఉన్న సంబంధాల పైన చర్చ జరిగే విధంగా ఈ వ్యాఖ్యలు కారణమవుతున్నాయి. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లోనూ చంద్రబాబు దూరం పాటిస్తున్నారు.

కొంత కాలంగా రేవంత్ ను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపారు. పీసీసీ చీఫ్ అయ్యేందుకు సహకరించారని ప్ర‌చారం బ‌లంగా ఉంది. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలను వైసీపీ ఏపీలోనూ తెలంగాన‌లో బీజేపీ అనుకూలంగా మ‌లుచుకునే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తం మీద చంద్ర‌బాబు ఇంత‌కాలం వేసిన వ్యూహాల‌న్నింటినీ మునుగోడు స‌భ ద్వారా రేవంత్ రెడ్డి బూమ్ రాంగ్ చేయ‌డంతో పాటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బ్ర‌హ్మాస్త్రాన్ని అందించారు. దాన్ని రాబోవు రోజుల్లో వైసీపీ బ‌లంగా చంద్ర‌బాబు మీద ఎలా ఎక్కుపెట్ట‌నుందో చూడాలి.