Site icon HashtagU Telugu

Tirumala: తిరుమలలో శ్రీవారి నామాలే మార్మోగాలి: సీఎం చంద్రబాబు

Chandrababu-TTD Meeting

Chandrababu-TTD Meeting

తిరుమల: తిరుమల పవిత్రత మరియు నమ్మకాన్ని కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ముఖ్యమైన సూచనలు చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప ఇతర మాటలు వినిపించకూడదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిలో ప్రశాంతతకు భంగం కలగకూడదని ఆయన తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాల పరంగా ఏ విషయంలోనూ రాజీ పడరాదని కుండబద్దలు కొట్టారు.

పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫీడ్‌బ్యాక్ తప్పనిసరి :

తిరుమలలో అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి వచ్చిన స్పందన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగారు. ప్రతి భక్తుడికి తన అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. భక్తుల సలహాలు మరియు సూచనలతో సేవలను మరింత మెరుగ్గా అందించగలమని ఆయన పేర్కొన్నారు. తిరుమలతో పాటు, మిగతా ఆలయాల్లో కూడా భక్తుల అభిప్రాయాలను పొందేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సూచించారు.

స్వామి వారి ప్రసాదాలలో పెరిగిన నాణ్యత:

Tirumala Laddu

తిరుమల లడ్డూ ప్రసాదం మరియు అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు పేర్కొంటున్నారు. ఈ నాణ్యత ఇలాగే కొనసాగాలి, సేవలు మరింత మెరుగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని ఆయన కోరారు. ఉత్తమ పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని స్పష్టంగా తెలియజేశారు.

తిరుమల ఆలయంలో వీఐపీ సంస్కృతి తగ్గించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ఆలయానికి ప్రముఖులు రాగానే హడావుడి ఉండకూడదని చెప్పారు. ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా అలంకరణ ఉండాలి కానీ ఆర్భాటం మరియు అనవసర వ్యయం ఉండకూడదని సీఎం చంద్రబాబు హితవు పలికారు.

భక్తులతో హుందాగా వ్యవహరించాలి:

టీటీడీ సిబ్బందిని భక్తులతో గౌరవంతో నడుచుకోవాలని, విదేశాల నుండి వచ్చే భక్తులను కూడా గౌరవించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన. భక్తులు సంతృప్తితో మరియు అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలి. తిరుమల అనే పేరు వినగానే ఏడుకొండల శ్రీవారి వైభవం మరియు ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలి. స్విమ్స్ సేవలను మెరుగుపరచాలని ఆయన కోరారు. తిరుమల ప్రత్యేక క్షేత్రంగా ఉండటం, ఆలయ పవిత్రతను కాపాడడం మరియు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

అటవీ ప్రాంతాన్ని విస్తరించాలి:

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతను నిర్ధారించాలి. నీటి నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళిక ఏర్పాటుచేసుకోవడం చాలా అవసరం. అటవీ ప్రాంతాన్ని 72% నుండి 80% వరకు విస్తరించాలి. అటవీ సంరక్షణతో పాటు, అడవుల విస్తరణకు సంబంధించిన ఐదేళ్ల ప్రణాళికను రూపొందించి దానిపై పనిచేయాలి. బయోడైవర్సిటీ పరిరక్షణకు సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు సీఎం చంద్రబాబు వివరాలు అడిగారు.