Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 12న బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను టీటీడీ అధికారులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆరుగురు మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా వారిని సందర్శించి ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.
రెండు కమిటీల్లో సభ్యులు వీరే
వైజాగ్, నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు జోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు. తమిళనాడు,కేరళను సందర్శించే బోర్డు సభ్యుల కమిటీలో శ్రీరామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంత రాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందించనున్నారు. అదే విధంగా ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్యా వివరాలను కూడా ధృవీకరించి సేకరిస్తాయి. అంతే కాకుండా ఈ కమిటీ సభ్యులు తీవ్రంగా గాయపడిన భక్తులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను, పాక్షికంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు.
Also Read: Osmania Hospital Foundation: ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన: సీఎం రేవంత్
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కొందరు ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.