Site icon HashtagU Telugu

Tomato : మొన్నటి వరకు రైతులను లక్షాధికారులను చేసిన టమాటా..నేడు రోడ్డున పడేస్తుంది

Tamata Price Down

Tamata Price Down

దేశానికి వెన్నుముక రైతు(Farmer)..అలాంటి రైతు జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. పండించిన పంట తో ఒక్కోసారి రెండు మూడు నెలల్లోనే లక్షాధికారులు అవుతారు..కొన్నిసార్లు అదే పంటతో రోడ్డునపడతారు. ప్రస్తుతం టమాటా రైతుల (Tomato Farmers) జీవితాలు అలాగే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టమాటా (Tomato Price) ధర భారీగా పలికింది. మూడు నెలల వరకు టమాటా ను కొనేందుకు ప్రజలు వణికిపోయారు. అంతలా మార్కెట్ లో టమాటా ధర పలికింది. కేజీ రూ. 200 నుండి 300 పలికింది. దీంతో టమాటా సాగు చేసిన రైతులు ఈ రెండు , మూడు నెలల్లోనే లక్షాధికారులు అయ్యారు. ప్రభుత్వాలు సైతం టమాటా లో సబ్సిడీ రూపంలో ప్రజలకు అందజేసిందంటే అర్ధం చేసుకోవాలి. ఎంతలా టమాటా ధర పెరిగిందో.

అలాంటి టమాటా నేడు రైతులను కన్నీరు పెట్టిస్తుంది. పది రోజుల క్రితం వరకు కేజీ. 200 పలికిన టమాటా నేడు కేజీ రూ. 10 కూడా పలకడం లేదు. దీంతో టమాటా రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్ ( Pattikonda Market )లో కిలో టమాటా కేవలం 10 రూపాయలు, అంతకంటే తక్కువ పలకడం గమనార్హం. పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమాటా కొనుగోళ్లు శుక్రవారం పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. రైతులు మొదటి రోజే దాదాపుగా 10 టన్నుల సరకు మార్కెట్‌కు తీసుకొచ్చారు. వేలంలో క్వింటాల్ టమాటా రూ. 1000 కంటే తక్కువ ధరే పలికింది. ఆ లెక్కన కిలో టమాటా రూ.10 కూడా పలకలేదు. దాంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వలెనే టమాటా ధరలు భారీగా పడిపోతున్నాయని పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ వ్యాపారులు అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని చెపుతున్నారు.

మొన్నటి వరకు టమాటా ధర భారీగా పలుకుతుండడం తో చాలామంది రైతులు టమాటా సాగు చేసారు. తీరా ఇప్పుడు ధర లేకపోవడం తో వారంతా ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమందైతే రోడ్డు మీద టమాటా పారబోస్తున్నారు. రైతుల నుంచి కిలో రూ.10 చొప్పున టమాటాలు కొంటున్న వ్యాపారులు మార్కెట్ లో మాత్రం 40, 50 రూపాయలకు అమ్ముతున్నారు. టమాటా ధరలు తగ్గడంతో ఇతర కూరగాయల ధరలు సైతం అమాంతం తగ్గుతున్నాయి. ఏది ఏమైనప్పటికి మొన్నటి వరకు రైతులను రాజులను చేసిన టమాటా..నేడు బిక్షగాళ్లను చేస్తుంది.