Site icon HashtagU Telugu

Tomato : త‌గ్గుముఖం ప‌డుతున్న ట‌మాటా ధ‌ర‌లు.. ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు

Benefits of Tomatoes

Subsidy Tomato Ap

టమాటా ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య ప్ర‌జ‌లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గత వారం రోజులుగా కిలో రూ.250 నుంచి రూ.300 వరకు పలికిన టమాట ధరలు ఖరీఫ్‌ పంట మార్కెట్‌లోకి రావడంతో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రకం, నాణ్యతను బట్టి కిలోకు రూ. 50 నుండి రూ. 100 వరకు ధరల్లో గణనీయమైన తగ్గుదల ఉందని వ్యాపారులు అంటున్నారు. అననుకూల వాతావరణ పరిస్థితులు, డిమాండ్‌కు త‌గ్గ స‌ర‌ఫరా లేక‌పోవ‌డంతో టమాటా ధ‌ర ఆకాశ‌నంటింది. అయితే ప్ర‌స్తుతం ఉత్ప‌త్తి ఎక్కువ‌గా ఉండ‌టంతో రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె వంటి మార్కెట్‌లకు ఖరీఫ్‌ పంట రాక సానుకూల ప్రభావం చూపిందని.. సోమవారం కిలో ధర రూ.76 నుంచి రూ.136 వరకు నమోదైందని అధికారులు తెలిపారు

కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో సహా ఇతర మార్కెట్‌లలో కూడా ధరలు గణనీయంగా తగ్గాయి. రాజమహేంద్రవరం, కొవ్వూరు మార్కెట్‌లలో గ్రేడ్‌-1 నాణ్యమైన టమోటా కిలో రూ.60 నుంచి రూ.70కి తగ్గగా ప్రస్తుతం రూ.100కు విక్రయిస్తున్నారు. కాకినాడ మార్కెట్‌లో మధ్య తరహా టమోటా కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో కిలో రూ.35 నుంచి రూ.40 వరకు తగ్గుతుందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు 50 మెట్రిక్‌ టన్నుల టమోటాలు దిగుమతులు కావడం వల్ల గ్రేడ్‌-1 నాణ్యమైన ఉత్పత్తులకు కిలో రూ.100 ధర స్థిరంగా ఉండేందుకు దోహదపడిందని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ వినయ్ తెలిపారు. ప్రస్తుతం కర్నూలు రైతు బజార్‌లో టమాట కిలో రూ.50 నుంచి రూ.100 వరకు లభిస్తోంది. మిగతా చాలా కూరగాయలు ఇప్పుడు కిలో రూ.30 నుంచి రూ.60 వరకు పలుకుతున్నాయి.

విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతంలో గత వారం రూ.150 నుంచి రూ.160 ఉన్న ట‌మాటా ధ‌ర కిలో రూ.100కి పడిపోయింది. మూడు రోజుల క్రితం గోపాలపట్నం రైతు బజార్ ముందు చాలా పొడవైన క్యూ కనిపించింది. క్యూలైన్లో కొందరు మహిళలు గొడవపడడంతో స్వల్ప లాఠీచార్జి జరిగింది. అయితే టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు ఊరట లభించింది. విశాఖపట్నంలో 13 రైతు బజార్లు ఉన్నాయని, ప్రతిరోజూ సుమారు 30 టన్నుల టమోటాలు అమ్ముడవుతున్నాయని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యాషిన్ తెలిపారు.

విశాఖపట్నం శివార్లలోని ఆనంద పురం ప్రాంతంలో టమాటా పంటను ప్రారంభించినట్లు తెలిపారు. ఆనంద పురం నుండి టమోటాలు నగరానికి రావడం ప్రారంభించినందున ధరలు పడిపోయింద‌ని తెలిపారు. విజయవాడలో వారం రోజుల క్రితం అత్యధికంగా రూ.150 పలికిన టమాటా ధర రూ.80కి పడిపోయింది. ప్రస్తుతం అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి, బెంగళూరు నుంచి కూడా టమోటాలు తీసుకురావడంతో ధర తగ్గిందని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో గత రెండ్రోజుల క్రితం అత్యధికంగా రూ.120 పలికిన టమాటా ధర రూ.80కి పడిపోయింది. రైతులు పొలాల నుంచి కొత్త నిల్వలను మార్కెట్‌కు తీసుకురావడంతో ఇతర కూరగాయల ధరలు కూడా కిలోకు ఐదు నుంచి ఎనిమిది రూపాయలు స్వల్పంగా తగ్గుతున్నాయి. కిలో రూ.100 పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు రూ.80కి విక్రయించారు.