Tollywood Actors Meet Jagan : జ‌గ‌న్ పంచ‌న టాప్ హీరోలు

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసిన టాలీవుడ్ క‌థ అదే...క‌థ‌నం కూడా దాదాపుగా పాత‌దే...కానీ, న‌టులు మారిపోయారు.

  • Written By:
  • Updated On - February 11, 2022 / 01:17 AM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసిన టాలీవుడ్ క‌థ అదే…క‌థ‌నం కూడా దాదాపుగా పాత‌దే…కానీ, న‌టులు మారిపోయారు. ఫ‌స్టాప్ లో చిరంజీవి, నాగార్జున‌, రాజ‌మౌళి, సురేష్ బాబు, దిల్ రాజు , న‌ట్టికుమార్ క‌నిపించారు. సెకండాఫ్ కు వచ్చేట‌ప్ప‌టికి చిరంజీవి, ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి, కొర‌టాల శివ, పోసాని ముర‌ళీకృష్ణ‌, ఆలీ, నారాయ‌ణ‌మూర్తి ఉన్నారు. ఫస్ట్ అండ్ సెకండాఫ్ రెండింటిలోనూ చిరంజీవి, రాజ‌మౌళి క‌నిపించారు. జ‌గ‌న్ తో భేటీ అయిన టాలీవుడ్ సెకండాఫ్ క‌థ‌లో ఒక్క రాజ‌మౌళి మిన‌హా దాదాపు అంద‌రూ వైసీపీ సానుభూతిప‌రులు ఉండ‌డం గ‌మ‌నార్హం.రాజ‌కీయాల‌కు దూరంగా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఉంటారు. హీరో మ‌హేష్ బాబు కూడా అంతేగానీ..ఆయ‌న ఫ్యామిలీ మొద‌టి నుంచి కాంగ్రెస్ కు స‌న్నిహితం. పైగా వైఎస్ ఫ్యామిలీతోనూ సాన్నిహిత్యం ఉంది. ఇక హీరో ప్ర‌భాస్ కూడా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ప్ప‌టికీ పెద్ద‌నాన్న క్రిష్ణంరాజు రాజ‌కీయ వార‌స‌త్వం ఉంది. చాలా కాలంగా క్రిష్ణంరాజు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం వేచిచూస్తున్నాడు. ప్ర‌స్తుతం బీజేపీ, వైసీపీ స‌హ‌జ మిత్రులుగా ఏపీలో ఉన్నాయని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పోసాని, ఆలీ ప‌క్కా వైసీపీ పార్టీకి చెందిన న‌టులు. పోసానికి స‌మీప బంధువు కొర‌టాల శివ‌. ఇక ఆర్ నారాయ‌ణ‌మూర్తి కామ్రేడ్ కోవ‌లోకి వ‌స్తాడు. సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్ కొంత మేర‌కు చూసుకుని వెళ్లిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఎప్పుడూ ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉండే ప్ర‌భాస్, మ‌హేష్ బాబు సీన్లోకి రావ‌డ‌మే సెకండాఫ్ లోని జ‌గ‌న్ భేటీ హైలెట్ పాయింట్. రాజ‌కీయాల‌కే కాదు, సినిమా గ్రూప్ ల వివాదాల‌కు కూడా ఆ ఇద్ద‌రు దూరంగా ఉంటారు. దాదాపుగా రాజ‌మౌళి కూడా అంతే అయిన‌ప్ప‌టికీ ప‌రోక్షంగా ఆయ‌న మీద చంద్ర‌బాబు ముద్ర ఉంది. ఇక చిరంజీవి టాలీవుడ్ టిక్కెట్ల సినిమాను మొత్తంగా న‌డిపిస్తున్నాడు. వెట‌ర‌న్ హీరోగా పేరున్న చిరంజీవి టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఇటీవ‌ల ఫోక‌స్ అవుతున్నాడు. తొలి విడ‌త జ‌గ‌న్ తో భేటీ అయిన‌ప్పుడు కూడా ఆయ‌న లీడ్ చేశాడు. అయితే, ఇటీవ‌ల ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్లో వెళ్లి ఏకాంతంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసి ప‌లు అనుమానాల‌కు అవకాశం ఇచ్చాడు. రాజ‌కీయ కోణాన్ని బాగా అద్దుకున్నాడు.తొలిసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయిన చిరంజీవి టీమ్ లో నిర్మాత‌లు న‌ట్టికుమార్‌, దిల్ రాజు , సురేష్ బాబు ఉన్నారు. ఈసారి భేటీ కోసం వెళ్లిన వాళ్ల‌లో సంపూర్ణ‌మైన (పెద్ద నిర్మాత‌లు)నిర్మాత‌లు ఎవ‌రూ లేరు. పైగా దిల్ రాజు, న‌ట్టికుమార్ ఇద్ద‌రూ గ‌తంలో పేర్ని నాని తో స‌మావేశం అయ్యారు. టిక్కెట్ల వ్య‌వ‌హారం కొలిక్కి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఈసారి చిరు టీంలో వాళ్లిద్ద‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ద‌గ్గుబాటి సురేష్ బాబు ఏకంగా జ‌గ‌న్ స‌ర్కార్ మీద గుర్రుగా ఉన్నాడు. ఈసారి చిరంజీవి టీమ్ లో అగ్ర హీరోలు ఉండ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాగా, మిగిలిన వాళ్లు దాదాపుగా వైసీపీ సానుభూతిప‌రులు ఉన్నారంటే, రాజ‌కీయ ప్రాధాన్యం ఉంద‌ని భావించ‌డానికి అవ‌కాశం ఉంది.

మొదటి సారి టాలీవుడ్ ప్ర‌ముఖులు జ‌గ‌న్ అపాయిట్మెంట్ తీసుకుని వెళ్లారు. ప్ర‌త్యేక విమానంలో అంద‌రూ క‌లిసి వెళ్లి జ‌గ‌న్ కు అభినంద‌న‌లు తెలిపారు. అప్పుడే టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్రణ‌, ఆన్ లైన్ విధానానికి బీజం ప‌డింది. ఆ రోజున సినీ ప్ర‌ముఖులు ఇచ్చిన విన‌తిప‌త్రం మేర‌కు మాత్ర‌మే జీవో నెంబ‌ర్ 35ను తీసుకొచ్చామ‌ని మంత్రి పేర్ని నాని చెబుతున్నాడు. ఆ త‌రువాత ప్ర‌భుత్వానికి, టాలీవుడ్ కు మ‌ధ్య అగాధం ఏర్ప‌డింది. న్యాయం కోసం హైకోర్టుకు సినీ పెద్ద‌లు వెళ్లారు. ప్ర‌త్యేక క‌మిటీని ఈ ఇష్యూ మీద వేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఆ మేర‌కు ప్ర‌భుత్వం నియ‌మించిన‌ క‌మిటీ సినిమా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేస్తోంది. టిక్కెట్‌ ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ విక్ర‌యంపై రెండుసార్లు ఆ క‌మిటీ స‌మావేశం అయింది. ఆ లోపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆహ్వానం మేర‌కు ప్ర‌త్యేక విమానంలో సంక్రాంతి విందుకు చిరంజీవి ఒక్క‌డే వెళ్లాడు. ఆ స‌మావేశం వాళ్లిద్ద‌రి వ్య‌క్తిగ‌త స‌మావేశంగా ఫోక‌స్ అయింది. మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆహ్వానం మేర‌కు గురువారం చిరంజీవి అండ్ కో తాడేప‌ల్లికి వెళ్లింది. ఇదే స‌మ‌యంలో ప్రాథ‌మిక నివేదిక‌ ఇంకా ప్ర‌భుత్వానికి అంద‌లేద‌ని బుధ‌వారం మంత్రి పేర్ని నాని చెప్ప‌డం గ‌మ‌నార్హం. హైకోర్టు ఆదేశం మేర‌కు ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ ఇంకా నివేదిక ఇవ్వ‌కుండానే జ‌గ‌న్ పిలుపు మేర‌కు చిరు అండ్ కో భేటీ అయింది. పైగా వెళ్లిన వాళ్ల‌లో మోజార్టీ న‌టులు ఆనాడు వైఎస్ ఇప్పుడు వైసీపీ సానుభూతిప‌రులు కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టాలీవుడ్ టీంను తాడేప‌ల్లి లోని సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద ప్ర‌భుత్వ అధికారులు సాద‌రంగా ఆహ్వానించారు. ముఖ్యంగా జీవో నంబ‌రు 35లో స‌వ‌ర‌ణ‌ల‌పై చ‌ర్చించ‌నున్నారని తెలుస్తోంది. థియేట‌ర్ల వ‌ర్గీక‌ర‌ణ‌, వాటిల్లో స్నాక్స్ అమ్మ‌కాల ధ‌ర‌లు వంటి అంశాల‌పై కూడా చ‌ర్చిస్తారు. ఆ మేర‌కు అధికార‌కంగా తెలిసిన అంశం. కానీ, ఈ సమావేశానికి `మా` అధ్యక్షుడు మంచు విష్ణు దూరంగా ఉన్నాడు. సినీ పెద్ద‌లుగా ఉన్న బాల‌క్రిష్ణ‌, నాగార్జున‌, దగ్గుబాటి సురేష్‌, దిల్ రాజు, అల్లు అర‌వింద్ త‌దిత‌రులు దూరంగా ఉండ‌డంపై అన్ స్టాప‌బుల్ చ‌ర్చ టాలీవుడ్ లో జ‌రుగుతోంది.