Site icon HashtagU Telugu

AP New Roads Policy: ఇకపై రాష్ట్ర రహదారుల్లో కూడా మోగనున్న టోల్ చార్జీలు…

Ap New Roads Policy

Ap New Roads Policy

AP New Roads Policy: ఏపీలో రహదారుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల నిర్వహణను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే విషయంపై సీఎం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సీఎం చెప్పారు. గ్రామాల్లో జాతీయ రహదారుల మాదిరిగాను రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన వెల్లడించారు. శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతుండగా రహదారుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు స్పందించారు.

రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సీఎం చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణానికి కొత్త విధానాలను అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రహదారులు గుంతలతో నిండి ఉన్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం చెప్పారు.

రూ.850 కోట్లతో రోడ్ల మరమ్మత్తులు మొదలు:

సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, భారీ వాహనాలకు టోల్ విధించి నాణ్యమైన రోడ్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజాభిప్రాయం తెలుసుకొని కొత్త విధానాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల వరకు టోల్ రుసుములు ఉండబోదని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర రహదారులను గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు. రోడ్ల మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేసాం, ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రానికి వచ్చే వారికీ మెరుగైన రహదారులు కనిపించాలని, అందుకే మరమ్మత్తులను వేగవంతం చేశామని సీఎం చెప్పారు. “మన వద్ద డబ్బులు లేవు, కానీ ఆలోచనలు ఉన్నాయి” అని తెలిపారు. “ఒక మంచి ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

పైలట్ ప్రాజెక్ట్ గా ఉభయ గోదావరి జిల్లాలు:

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రోడ్ల నిర్వహణకు జాతీయ రహదారుల మాదిరిగా టెండర్లు పిలిచి, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామం నుంచి మండల కేంద్రాలకు టోల్ ఫీజు ఉండదని, మిగిలిన ప్రాంతాల్లో మాత్రం టోల్ వసూలు ఉంటుందని పేర్కొన్నారు. భారీ వాహనాలు, బస్సులు, కార్లు, లారీల కోసం మాత్రమే యూజర్ ఛార్జీలు ఉంటాయని చెప్పారు.

ఈ విధానానికి శాసనసభ సభ్యులు అంగీకరించి భావిస్తే, ఉభయ గోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు అమలు చేయాలని చూస్తున్నాం అన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తరించాలనేది నా యోచన అన్నారు.

మండల కేంద్రం దాటితేనే టోల్ వసూలు:

ఔట్‌సోర్సింగ్ విధానంలో రోడ్ల నిర్మాణం ప్రతిపాదనపై ప్రజాప్రతినిధులు ప్రజలను ఒప్పించాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విధానానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉంటే, వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చేతులు ఏతండి అని అడగగా అసెంబ్లీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ చేతులు ఎత్తి ఆమోదం తెలిపారు. అయితే, కొత్త విధానాన్ని బలవంతంగా అమలు చేయబోమని స్పష్టం చేశారు.

తాజాగా, కొత్త రహదారులపై టోల్ వసూలు చేస్తామనే ప్రతిపాదనను ప్రకటించారు. కానీ, అన్ని వాహనాలకు టోల్ వసూలు ఉండదని, కేవలం కార్లు, లారీలు, బస్సుల వంటి భారీ వాహనాలకే టోల్ వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఆటో, బైక్, ట్రాక్టర్లు వంటి చిన్న వాహనాలకు టోల్ ఉండదని స్పష్టం చేశారు. గ్రామం నుంచి మండల కేంద్రం వరకు టోల్ తీసుకోబోమని, మండల కేంద్రం దాటిన తర్వాత మాత్రమే టోల్ వసూలు చేయనున్నట్లు చెప్పారు.

ఈ ప్రతిపాదన కేవలం ఒక ఆలోచన మాత్రమేనని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. నాణ్యమైన రోడ్లు నిర్మించటం వల్ల గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు మెరుగుపడతాయని, గ్రామాల అభివృద్ధిలో ఇది ఒక కీలక భాగం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలను ఒప్పించిన తర్వాత మాత్రమే ఈ కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టబడతుందని ఆయన తెలిపారు.