తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) పార్టీ శ్రేణులకు ముఖ్య సూచనలు చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తిరిగేలా ‘ “ఇంటింటికి తొలి అడుగు “‘ (Intintiki Tholi Adugu) పేరుతో విజయయాత్ర నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ నేతల నుంచి గ్రాస్రూట్ వర్కర్ల వరకు అందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు.
Trump : ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే..
పార్టీ సంస్థాగతంగా బలపడాలంటే కమిటీలు వేగంగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కృషి చేసే వారికి అందులో స్థానం కల్పించాలని సీఎం పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం అమలు తల్లిదండ్రుల్లో విశేష సంతృప్తిని తెచ్చిందని, త్వరలో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కూడా ప్రారంభమవుతుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్-6 పథకాల అమలులో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీ’ నినాదంతో ప్రజలకు ఇచ్చిన హామీలను వేగంగా నెరవేరుస్తున్నామని చెప్పారు.
ఇక 21వ తేదీన విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా కార్యక్రమం నిర్వహించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం కింద 67.27 లక్షల మంది తల్లులకు రూ.8,747 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోల్చితే అదనంగా 25 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చామని, ఏడాదికి రూ.3,205 కోట్లు ఎక్కువగా ఖర్చు చేస్తామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నక్యాంటీన్లు, విద్యార్థులకు లాభదాయక పథకాలు, అన్నదాత సంక్షేమం ఇవన్నీ కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుతో విజయవంతంగా అమలు చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.