Toddy Deaths in AP : ఎవ‌రిది నిజం!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం కేంద్రంగా జ‌రిగిన సారా క‌ల్తీ వ్య‌వ‌హారం `పెగాసెస్`తో అడుగున ప‌డింది.

  • Written By:
  • Publish Date - March 22, 2022 / 05:20 PM IST

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం కేంద్రంగా జ‌రిగిన సారా క‌ల్తీ వ్య‌వ‌హారం `పెగాసెస్`తో అడుగున ప‌డింది. మ‌ర‌ణించిన వాళ్ల కుటుంబీకులు క‌ల్తీసారా తాగి చ‌నిపోయార‌ని చెబుతున్నారు. కానీ, ప్ర‌భుత్వం మాత్రం స‌హ‌జ మ‌ర‌ణాలుగా చిత్రీక‌రిస్తోంది. వాటిపై సిట్టింగ్ జ‌డ్జి చేత విచార‌ణ జ‌రిపించి ప్ర‌భుత్వ పార‌ద‌ర్శ‌క‌త‌ను జ‌గ‌న్ నిరూపించుకోవాలి. లేదంటే ఆయ‌న పాల‌న‌ను సారా క‌ల్తీ మ‌ర‌ణాలు వెంటాడుతూనే ఉంటాయి. ఎలాంటి విచార‌ణ లేకుండా స‌హ‌జ మ‌ర‌ణాలుగా చిత్రీక‌రించ‌డం విప‌క్షాల‌కే కాదు సామాన్యుల‌కు కూడా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఆ సంఘ‌ట‌న‌పై `హ్యాష్ ట్యాగ్ యూ` సేక‌రించిన ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం క‌ల్తీ సారా కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా జంగారెడ్డి గూడెంలో మ‌ర‌ణించార‌ని తెలుస్తోంది. వాటిలోని కొన్ని వివ‌రాల‌ను గ‌మ‌నిస్తే..జంగారెడ్డి గూడెంకు చెందిన వెంపల అనిల్ కుమార్ కు ఎలాంటి అనారోగ్యం లేదు. ఆయ‌న వ‌య‌సు 37 సంవ‌త్స‌రాలు. జంగారెడ్డిగూడెంలోని ఉప్పలిమెట్ట ప్రాంతంలో నివాసం ఉండేవాడు. వృత్తి రీత్యా బైక్ మెకానిక్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనిల్ కుమార్ తండ్రి, ఇద్దరు సోదరులు కూడా బైక్ మెకానిక్ లుగానే పని చేస్తున్నారు. చాలా కాలంగా అనిల్ కుమార్‌కు మద్యం అలవాటు ఉండేది. ఆదాయం తగ్గిపోవ‌డం మద్యం రేట్లు పెర‌గ‌డంతో గ‌త ఆరు నెలల నుంచి నాటు సారాకు అలవాటు పడ్డాడు. రోజు మాదిరిగానే ఈ నెల 11వ తేదీ నాటు సారా తాగాడు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి కళ్లు తిరుగుతూ, వాంతులు చేసుకున్నాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తాపీ ప‌ని చేసుకునే బండారు శ్రీనివాస్ పని ఉన్నా, లేకపోయినా నాటుసారా ప‌డందే నిద్ర‌పోడు. 49 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న శ్రీనివాస్ ఈ నెల 10న సాయంత్రం తాగి ఇంటికి వచ్చాడు. రాత్రికిరాత్రే వాంతులు కావ‌డంతో ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే మరణించాడు. ఆ మేర‌కు ఆయన భార్య లక్ష్మి చెబుతోంది. నిత్యం సారాతాగే శ్రీనివాస్ చుడ్డానికి చురుగ్గా ఉంటూ ఏ నాడూ ఆనారోగ్య సమస్యలు గురి కాలేదని ఆయ‌న భార్య చెబుతోంది. నాటు సారా తాగడం వల్లనే మృతి చెందాడు. వైద్యులు కూడా సారా కార‌ణంగా మ‌ర‌ణించాడ‌ని చెప్పిన‌ట్టు ఆయ‌న భార్య ల‌క్ష్మి చెబుతోంది. అతని కుమారుడు, కోడలు అదే చెబుతున్నారు.ఈయన వయసు 51 సంవత్సరాలు. జంగారెడ్డిగూడెంలోని గాంధీ బొమ్మ వీధిలో ఉండే 51 సంవ‌త్స‌రాలు మడిచర్ల అప్పారావు చేపల మార్కెట్ లో పని చేస్తూ జీవిస్తున్నాడు. చాలా కాలం నుండి మద్యం సేవించే అలవాటు ఉండేది. పని ఉన్నా లేకపోయినా రోజు నాటు సారా తాగుతూ ఉండేవాడు. ఈ నెల 10వ తేదీన సారా తాగిన తరువాత అతనికి వాంతులు కావ‌డంతో కళ్లు తేలేసి అపస్మారక స్థితికి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈనెల 9న ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తీసుకువెళ్లగా 9.45 గంటలకే ఆయన చనిపోయాడు. ఆయనకు అప్పుడప్పుడు జ్వరం, జలుబు లాంటి వచ్చాయే కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేవు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవ‌ని అప్పారావు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తాగిన నాటుసారాలో ఏదో కల్తీ జరిగి ఉంటుంద‌ని కుటుంబ స‌భ్యులు అనుమానిస్తున్నారు. రోజూ అప్పారావు సారా తాగుతాడు. ఎప్పుడూ ఏమి కాలేదు. ఆరోజు ఏదో కలిసి ఉంటుందని అప్పారావు కుమార్తె రాజేశ్వరి అంటోంది. ఇంచుమించు ఇలాగే జంగారెడ్డిగూడెంలో దాదాపు 25 మందికిపైగా చనిపోయారు. అందరూ ఇదే తరహా కారణాలు, లక్షణాలు చెబుతున్నారు.

జంగారెడ్డిగూడెంలో మార్చి 9, 10 తేదీల్లో 15 మంది మరణించారు. ఒకరి తర్వాత ఒకరు.. 15 మంది మరణించే వరకు విషయం బయటకు రాలేదు. ఆల‌స్యంగా బయటకు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే నివేదిక పంపించాలంటూ ఆదేశించారు. అప్పటికప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలను కాద‌ని, నాటుసారా మ‌ర‌ణాలు అంటే ఇష్యూ అవుతుందని భావించిన స్థానిక అధికారులు “సహజ మరణాలు” అంటూ నివేదిక ఇచ్చేసారు. కానీ, అప్పటికే నాటు సారా వల్లనే ఈ మరణాలు జరిగాయని స్థానికులు, అక్కడి వైద్యులు ఒక అభిప్రాయానికి వ‌చ్చారు. జ‌గ‌న్ స‌ర్కార్ కు భ‌య‌ప‌డి స్థానిక‌ అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చినట్లు స్థానికులు చేస్తోన్న ఆరోప‌ణ‌. స్థానిక అధికారులు పంపిన త‌ప్పుడు నివేదిక‌ను జిల్లా అధికారులు ప్రభుత్వానికి అందించార‌ని తెలుస్తోంది. దాన్నే ప్ర‌భుత్వం విశ్వసిస్తూ సహజ మరణాలుగా చెబుతోంది. సీఎం జగన్ కూడా ఆ నివేదిక మీద స్టాండ్ అయ్యాడు. కానీ, క్షేత్ర స్థాయిలో 16 సంవత్సరాల వయసు వారి నుండి 60 సంవత్సరాల వయసు వృద్ధుడి వరకూ సుమారు 25 మంది ఎలా చనిపోయారు..? అని ప్రశ్నిస్తే నాటు సారా వల్ల చనిపోయారు అని స్థానికులు చెబుతున్నారు. అలాగే, స్థానికంగా ఉండే వైసీపీ లీడ‌ర్లు కూడా అదే చెప్ప‌డం గ‌మ‌నార్హం.బాధిత కుటుంబాల నుండి ప్రభుత్వ అధికారులు తీసుకున్న వాగ్మూలంలో “నాటుసారా తాగి ఇంటికి వచ్చాక ఇలా అపస్మారక స్థితికి గురై.. మరణించారు” అని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు వారి నుండి తీసుకున్న స్టేట్ మెంట్ లో కూడా నాటు సారా వల్ల చనిపోయినట్లే రాసుకున్నారు. కానీ, ప్రభుత్వానికి సహజ మరణాలుగా చిత్రీక‌రిస్తూ స్థానిక అధికారులు ఇచ్చిన నివేదిక త‌ప్పుల‌త‌డ‌క అని స్ప‌ష్టం అవుతోంది.

వాస్తవంగా నాటు సారా కార‌ణంగా ఇలా చ‌నిపోవ‌డం అరుదు. ఎందుకంటే నాటు సారా ఊట బెల్లంతో తయారు చేస్తారు. ఇది నిజానికి పెద్దగా హాని కరం కాదు. కానీ, మత్తు ఇస్తుంది. కేవ‌లం ఆ రెండు మూడు రోజుల వ్య‌వ‌ధిలో నాటు సారా తాగిన వాళ్లు ఎందుకు చనిపోయారు? అంటే..ఏదో కెమిక‌ల్ సారా త‌యారీలో కలిపి ఉండవచ్చు. ఆ కార‌ణంగా మ‌ర‌ణాలు సంభ‌వించి ఉంటాయ‌ని అనుమానం.జంగారెడ్డిగూడెం, బూట్టాయిగూడెం తదితర ఏజన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నాటు సారు కాస్తుంటారు. గ‌తంలో ఎప్పుడూ ఇలా పెద్ద సంఖ్య‌లో చనిపోలేదు. ఒక వేళ ప్ర‌భుత్వం చెబుతోన్న విధంగా స‌హ‌జ‌ మరణాలు అయితే మహిళలు కూడా చనిపోవాలి. కేవలం పురుషులే ఎందుకు చనిపోతారు అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. పైగా చనిపోయిన వాళ్లు అందరూ సారా తాగే అలవాటు ఉన్న పురుషులు. సో..ఏ కోణం నుంచి ఆలోచించిన‌ప్ప‌టికీ జంగారెడ్డి గూడెం మ‌ర‌ణాలు క‌ల్తీసారా కార‌ణంగా సంభ‌వించాయ‌ని చెప్పువ‌చ్చు. కానీ, ప్ర‌భుత్వం స‌హ‌జ మ‌ర‌ణాలుగా చిత్రీక‌రించ‌డం చూసి టీడీపీ ఆందోళ‌న‌కు దిగింది. జ‌రిగిన త‌ప్పును అంగీక‌రిస్తే, ప‌రువు పోతుంద‌ని స‌హ‌జ మ‌ర‌ణాలుగా చెప్ప‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ ఫిక్స్ అయింది. అంతిమంగా క‌ల్తీసారా తాగి మ‌ర‌ణించిన కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌న్న‌ది నిజం. రాజ‌కీయ బేష‌జాల‌కు పోకుండా ఇప్ప‌టికైనా మ‌ర‌ణించిన కుటుంబీకుల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ ఆదుకోవాలని ప‌లువురు కోరుతున్నారు.