ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు (Special Days) ఉంటాయి. ఆ రోజులు వ్యక్తిగతంగా, రాజకీయంగా, వృత్తిపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(APCM CHandrababu)కూ ఉంది. అదే మార్చి 15(March 15 ). సరిగ్గా 47 ఏళ్ల క్రితం, 1978లో ఇదే రోజున చంద్రబాబు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఐదేళ్ల మినహా మిగతా 41 ఏళ్లను శాసనసభ్యుడిగానే కొనసాగారు. 30 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా చంద్రబాబు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది మార్చి 15న స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. కార్మికులతో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో తనకు మార్చి 15 ఎందుకు ప్రత్యేకమో వివరించారు.
విద్యార్థి సంఘం నేతగా మొదలైన రాజకీయ ప్రస్థానం
చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలుపెట్టారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికై, ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌లో చేరారు. 1978లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్థక శాఖ, నీటిపారుదల శాఖల బాధ్యతలను నిర్వహించారు. రాజకీయంగా ఎదుగుతున్న సమయంలోనే 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. 1983 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పారు.
సీఎంగా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం
1995లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికై, రాష్ట్ర అభివృద్ధికి తనదైన ముద్ర వేశారు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సీఎం అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ, ఆయన ప్రతిపక్షనేతగా కొనసాగుతూ పార్టీని బలోపేతం చేశారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికై, రాష్ట్ర నిర్మాణానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో పరాజయం ఎదురైనా, 2024లో తిరిగి సీఎం అయ్యారు. ఈ విజయాల్లో తన రాజకీయ ప్రస్థానానికి మూలస్తంభమైన మార్చి 15ను ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజును కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలకు మరింత చేరువవుతారు.