రాజధాని అమరావతి పునర్ నిర్మాణ (Amaravati Relaunch) పనులకు ప్రధాని మోదీ (Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా వేల కోట్ల రూపాయిల పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ.. ఈ రోజు ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నారు. గతంలోనూ మోదీయే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం గుర్తుచేస్తూ, మళ్లీ ఆయనే ఈ పనులకు పునఃప్రారంభం ఇవ్వడం సంతోషకరమని తెలిపారు.
ఉగ్రవాదంపై మద్దతు – మోదీకి అండగా ఏపీ
ఉగ్రవాదంపై కేంద్రం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా మద్దతు ఇవ్వనున్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ చాలా గంభీరంగా ఉన్నారని, దేశం మొత్తం ఆయన వెనుక ఉందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నేత ప్రధానిగా ఉండటం భారతదేశానికి లభించిన వరమని అభిప్రాయపడ్డారు. భారత్ ఐదో ఆర్థికశక్తిగా ఎదగడంలో మోదీ నాయకత్వం కీలకమని తెలిపారు. దేశాభివృద్ధే మోదీ లక్ష్యమని అన్నారు.
రాష్ట్రాభివృద్ధి దిశగా చంద్రబాబు పునఃప్రయత్నం
గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని విమర్శించిన చంద్రబాబు, కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు నడుం బిగిస్తున్నామని చెప్పారు. కులగణన తీసుకోవాలని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, ఇది సామాజిక న్యాయం పట్ల తీసుకున్న గొప్ప చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పేదరిక నిర్మూలనతో పాటు అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నదని స్పష్టం చేశారు.