వైసీపీలో ఎమ్మెల్యేల మార్పులు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ అధిష్టానం విడుదల చేసిన నాలుగవ జాబితాలో 7 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక ఎస్సీ ఎంపీ స్థానంతో పాటు ఒక జనరల్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో చాలా మంది ఎస్సీ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత జగన్ మోడిచేయి చూపించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో తిరువూరు (ఎస్సీ) నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిని వైసీపీ అధిష్టానం మార్చింది. ఆయన స్థానంలో ఇటీవల టీడీపీలో నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ను ఇంఛార్జ్‌గా నియమించింది. దీంతో రక్షణనిధి పార్టీపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2014లో తిరువూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ గాలిలో కూడా స్వామిదాస్‌పై గెలిచారు. 2019లో మరోసారి రక్షణనిధికే వైసీపీ సీటు దక్కింది. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రక్షణనిధి గెలిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ముఖ్యనేతలను రక్షణనిధి దూరం పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో వైసీపీలో వర్గపోరు తీవ్రమైంది. ఇటు మున్సిపల్ ఛైర్‌పర్సన్ విషయంలో ఎమ్మెల్యే రక్షణనిధిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ తనని ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో వివాదస్పదమైంది. ఇటు సర్వేల్లోనూ మూడోసారి రక్షణనిధి గెలవరనే సంకేతాలు రావడంతో అభ్యర్థిని మార్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా నియోజకవర్గంలోని ముఖ్యనేతలు అధినేత జగన్‌మోహన్ రెడ్డికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నవారు కావడంతో ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో రక్షణనిధికి టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. తాజాగా జరిగిన పరిణామాలతో రక్షణనిధి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.
Also Read: TDP : తెలుగుదేశం – జనసేన గెలుపు అన్ స్టాపబుల్ .. గుడివాడ ‘రా..కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు
ఇటు టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపారు. టికెట్‌పై స్పష్టమైన హమీ వచ్చాకే ఆయన వైసీపీలో చేరారు. ఇటు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా స్వామిదాస్‌కు మద్దతుగా ఉన్నారు.తిరువూరులో స్వామిదాస్‌ని గెలిపించుకునే బాధ్యత తనదేనని వైసీపీ అధిష్టానానికి ఎంపీ కేశినేని నాని తెలిపారు. స్వామిదాస్ లోకల్ కావడం.. వివాదరహితుడిగా పేరుడటం.. రెండు సార్లుగా ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్ నాన్‌లోకల్ కావడం, టీడీపీ క్యాడర్ ఆయన వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నారు. లోకల్ నాన్‌లోకల్ అనే భావన ఇక్కడ వస్తే స్వామిదాస్ గెలిచే అవకాశం ఉంది.