Tiruvuru TDP : ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. టికెట్‌పై ఆశ‌లు..!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైంది.

  • Written By:
  • Updated On - February 17, 2023 / 08:03 AM IST

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైంది. జిల్లాలోని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట అయిన‌ప్ప‌టికీ గ‌త నాలుగు ప‌ర్యాయాలుగా ఓడిపోవాల్సి వ‌చ్చింది. 2004 నుంచి 2019 వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ ఓడిపోయింది. 2009, 2014 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల‌తో మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ ఓడిపోయారు. ఆ త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి జ‌వ‌హార్ ను తిరువూరు నుంచి పోటీ చేపించారు. చివ‌రి నిమిషంలో ఆయ‌న‌కు ఇక్క‌డ టికెట్ ఇవ్వ‌డం.. ఎవ‌రు పోటీ చేస్తార‌నేది క్లారిటీ రాక‌పోవ‌డం.. త‌దిత‌ర కార‌ణాల‌తో ఆయ‌న కూడా ఓడిపోయారు. ఆ త‌రువాత జ‌వ‌హార్ మ‌ళ్లీ కొవ్వూరు వైపే చూస్తున్నారు. అయితే తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక నేత‌ల్ని కాద‌ని అధిష్టానం నాన్‌లోక‌ల్ వ్యక్తిని తీసుకువ‌చ్చి ఇంచార్జ్‌గా నియ‌మించింది. తిరువూరులో ఓ కార్పోరేట్ ఆసుప‌త్రి నిర్వాహ‌కుడు శావ‌ల దేవ‌ద‌త్‌ని ఇంఛార్జ్‌గా పెట్టింది అధిష్టానం.

అయితే అప్ప‌టికే క‌ల‌హాల కాపురంగా ఉన్న తిరువూరు టీడీపీలో విభేదాలు మ‌రింత పెరిగాయి. ఇంఛార్జ్ వ‌చ్చి రెండేళ్లు గ‌డుస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ పుంజుకోలేదనే భావ‌న క్యాడ‌ర్‌లో వ‌చ్చింది. టికెట్ ఆశిస్తున్న వారితో కూడా ఇంఛార్జ్ స‌ఖ్య‌త‌గా ఉండ‌టం లేదనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల టికెట్ ఆశిస్తున్న జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాసం మునియ్య‌, ఇత‌ర వ్య‌క్తుల‌పై ఇంఛార్జ్ అనుచ‌రులు సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టుల‌పై పెద్ద దుమారం రేగింది. రెండు రోజుల క్రితం జ‌రిగిన తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో దీనిపై ర‌చ్చ జ‌రిగింది. పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు నెట్టెం ర‌ఘురామ్‌, ప‌రిశీల‌కుడు చిట్టిబాబు స‌మ‌క్షంలో ఈ అంశాన్ని లేవ‌నెత్తి స‌ద‌రు సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్‌ని స‌స్పెండ్ చేశారు.

ఇటీవ‌ల కాలంలో తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఎక్క‌డ కార్య‌క్ర‌మాలు ఉన్నా అంద‌రికంటే ముందుగానే వెళ్తున్నారు. గ‌తంలో కార్య‌క్ర‌మాల‌కు లేట్‌గా వ‌చ్చే స్వామిదాస్ ముందుగానే ప్రోగ్రాంల‌కు రావ‌డం క్యాడ‌ర్‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. పార్టీ స‌మావేశాల్లో సైతం తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌పై ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు. ఇక్క‌డ ఎమ్మెల్యే ఓడిపోవాలి.. చంద్ర‌బాబు మాత్రం ముఖ్య‌మంత్రి కావాల‌నే ధోర‌ణి తిరువూరు నాయ‌కుల‌కు ఉంద‌ని.. ఎన్నిక‌లంటే ఇక్క‌డి నాయ‌కులు పండుగ‌లాంటిదంటూ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ వ్యాఖ్య‌లు చేశారు. గ‌త మూడు సార్లు తాను ఓడుపోతూ వ‌చ్చాన‌ని.. నాలుగోసారి సానుభూతితో గెలిచే అవ‌కాశం ఉన్న చివ‌రి నిమిషంలో త‌న‌కు టికెట్ రాకుండా చేశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2024 ఎన్నిక‌ల్లో తిరువూరులో 30వేల మెజార్టీ వ‌స్తుంద‌ని చెప్పుకోవ‌డం పేప‌ర్ల‌కే త‌ప్ప గ్రౌండ్ లెవ‌ల్‌లో లేద‌న్నారు. అంద‌రు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తే వెయ్యి, రెండు వేల ఓట్ల‌తో బ‌య‌ట‌ప‌డ‌తామంటూ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ తెలిపారు.

స్వామిదాస్ ఇటీవ‌లకాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు, స‌మావేశాల్లో ఆయ‌న వ్యాఖ్య‌లు చూస్తుంటే తాను మ‌ళ్లీ పోటీ చేస్తున్నానంటూ క్యాడ‌ర్‌కి సంకేతాలు పంపిస్తున్నారు. త‌న అనుచ‌రులు వ‌ద్ద కూడా స్థానికుల‌కే టికెట్ ఇవ్వాల‌ని.. అయితే త‌న‌కు కానీ.. జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాసం మునియ్య కానీ టికెట్ ఇవ్వాల‌ని స‌న్నిహితుల‌తో అంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రీ ఎన్నిక‌ల్లో అధిష్టానం ఎవ‌రికి టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.