AP Woman in Kuwait: కువైట్‌లో తిరుప‌తి మ‌హిళ‌కు వేధింపులు.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన భ‌ర్త‌

ఉపాధి కోసం కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్లు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఓ మహిళ భ‌ర్త ఫిర్యాదు చేశాడు.

  • Written By:
  • Publish Date - May 31, 2022 / 11:06 PM IST

ఉపాధి కోసం కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్లు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఓ మహిళ భ‌ర్త ఫిర్యాదు చేశాడు. వారి చెర నుంచి ఆమెను రక్షించి స్వగ్రామమైన తిరుపతి జిల్లాకు తీసుకురావాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియోను భ‌ర్త విడుదల చేశాడు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం పెద్దవడ్డిపల్లికి చెందిన శ్రావణి అనే మహిళ ఉపాధి కోసం ఈ నెల 24న కువైట్ వెళ్లింది. ప్రస్తుత యజమాని తనను సరిగా చూసుకోవడం లేదని, వేరే చోట పనిలో పెట్టించాల‌ని ఏజెంట్ చెంగల్ రాజాకు చెప్పింది. అయితే ఏజెంట్ తనను గదిలో బంధించి లైంగికంగా, శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని సెల్ఫీ వీడియోలో ఆరోపించింది.

నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నానని శ్రావణి తెలిపింది. త‌న‌ను ఎలాగైనా భారత్‌కు రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల‌ని ఆమె కోరింది. అలాగే శ్రావణి భర్త చందు కుమార్ తన భార్యను రక్షించి ఇండియాకు తీసుకురావాలని అధికారులను కోరాడు. తన భార్య కువైట్‌లో బాధలు పడుతున్న విషయాన్ని మీడియా ప్రసారం చేయడంతో చంపేస్తానని బెదిరిస్తూ మంగళవారం తనకు పదే పదే ఫోన్లు వచ్చాయని చెప్పాడు. గల్ఫ్ ఏజెంట్ మోసంపై ఎర్రావారిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చందు కుమార్ తెలిపారు.