తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట (Tirupati Stampede) విషాదానికి కారణమైంది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు ( 6 killled) కోల్పోయారు. మృతులలో ఐదుగురు మహిళలు ఉండగా, ఒకరు పురుషుడు. వీరి మరణ వార్త యావత్ భక్తులను , ప్రజలను , ప్రభుత్వాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది.
మృతుల వివరాలు చూస్తే..
తొక్కిసలాటలో మరణించిన వారు నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటక బళ్లారి ప్రాంతానికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49)గా గుర్తించారు. వారి కుటుంబాలు ఈ విషాదంతో కన్నీటి పర్యంతమయ్యాయి. ఈ ఘటనలో మరో 40 మంది గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రి మరియు స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందించేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి సహాయ చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించడమే కాకుండా, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. భద్రతా లోపాలపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి రానున్నారు.