సికింద్రాబాద్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (TIRUMALA VANDE BHARAT) రైలు కోచ్ ల సంఖ్య 8 నుంచి 16కి పెరగనుంది. ఈ రైలు ప్రయాణ సమయాన్ని కూడా 15 నిమిషాలు తగ్గించారు. దీంతో ప్రయాణికులకు వెయిటింగ్ కష్టాలు తప్పనున్నాయి. ఇవన్నీ మే 17 నుంచి అమల్లోకి వస్తాయి. వందేభారత్‌లోని ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్, ఛైర్‌కార్ బోగీలలోని సీట్ల సంఖ్య 530 నుంచి 1,060కి పెరగనుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుత ప్రయాణ సమయం 8.30 గంటలు కాగా.. ఇకపై 8.15 గంటలు మాత్రమే. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరుతున్న ఈ రైలు మే 17 నుంచి 6.15కి బయలుదేరుతుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు రాత్రి 11.30 గంటలకే చేరుతుంది. ఈమేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ : Budget 2023: బడ్జెట్ లో వందే భారత్ రైళ్ల కేటాయింపు.. ఎవరికి లాభం?
ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని..
వాస్తవానికి సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో వందే భారత్ (TIRUMALA VANDE BHARAT) ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో తక్కువ సీట్ల కారణంగా చాలా మంది ఈ రైలులో ప్రయాణించలేకపోతున్నారు. ఈ తరుణంలో ప్రయాణికులకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బోగీల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తిరుమల టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ రైలు చాలా సౌకర్యంగా ఉంటోంది. చాలా మంది తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుని మళ్లీ అదే రైల్లో తిరిగి హైదరాబాద్ వచ్చేలా జర్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది.. మంగళవారం మాత్రం నడవదు. రైలుకు సంబంధించిన మెయింట్‌నెన్స్ పనుల కోసం మంగళవారం రోజు దాన్ని నడపరు.