Tirumala: వెంకన్న భక్తులకు ‘కొండంత’ కష్టాలు!

ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా గోవింద అంటూ శ్రీవారి దర్శనం కాగానే.. భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు.

  • Written By:
  • Updated On - April 13, 2022 / 02:01 PM IST

ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా గోవింద అంటూ శ్రీవారి దర్శనం కాగానే.. భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు. ఆ క్షణం కోసమే ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పుగా భరిస్తారు. కానీ తిరుమలలో అలాంటి దర్శనానికి వీలులేని పరిస్థితులు ఏర్పడడంతో భక్తులు మండిపడుతున్నారు. అలిపిరి నుంచి ఆనందనిలయం వరకు అన్నీ అవస్థలేనా? కరోనాకు ముందు నుంచి ఇప్పటివరకు చాలామంది భక్తులు మొక్కులు చెల్లించుకోలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని టీటీడీ కల్పించడంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. మరి ఈ పరిస్థితిని టీటీడీ ఎందుకు ముందే అంచనా వేయలేకపోయింది?

కొవిడ్ కు ముందు అలిపిరి మార్గంలో 20 వేల మందికి, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల మందికి టోకెన్లు ఇచ్చేవారు. నడకదారిన వచ్చేవారికి శీఘ్రదర్శనం ఏర్పాటుచేసేవారు. కానీ కరోనా సమయంలో లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు ఆ విధాన్ని రద్దు చేశారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఐదు నెలలుగా మూసేశారు. మార్చి నెలాఖరు లోపే దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పినా ఇప్పటి వరకు దాని ప్రస్తావనే తేవడం లేదు. ఈ మార్గమైతే కేవలం 2.1 కి.మి. ప్రయాణించి తిరుమల చేరుకోవచ్చు. ఇప్పుడు అలిపిరి నడకమార్గం మాత్రమే ఉపయోగంలో ఉంది. ఈమార్గంలో అయితే 7.8 కి.మి. ప్రయాణించాలి. ఇక నడకదారిన వెళ్లే భక్తులైనా సరే.. వారి దగ్గర సర్వదర్శనం లేదా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉంటేనే అనుమతి. లేదంటే లేదు.

కరోనాకు ముందైతే.. క్యూలైన్లో ఉన్నవారికి టిఫిన్, పాలు, మజ్జిగ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వీటిని ఇవ్వడం లేదు. చివరకు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఆందోళన చేయాల్సి వచ్చింది. అన్నదాన సత్రంలో ఒకేసారి 4 వేల మందికి అన్నదానం చేయచ్చు. గతంలో అయితే ఏడు కౌంటర్లు ఉండేవి. ఇప్పుడు రెండే ఉన్నాయి. అందుకే భక్తులు ఎక్కువగా రావడంతో అక్కడా ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు ఏవి? ఎన్ఆర్ఐలకు, జవాన్లకు సుపథం దర్శనమూ లేదు. దీంతో ఆయా వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇక భక్తుల రాక పెరగడంతో వసతికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తిరుమలలో ఏడు వేల గదులు ఉన్నాయి. వీటిలో 45 వేల మందికి వసతి కల్పించవచ్చు.

కాకపోతే వీటిలో 1000 గదుల వరకు వీఐపీలు, సంపన్నవర్గాలకి కేటాయించారు. మిగిలినవాటిలో 1650 గదులును ఆన్ లైన్ రిజర్వేషన్ ద్వారా కేటాయిస్తారు. ఇంకో 800 గదులను.. అప్పటికే వినియోగించుకుంటున్నవారు మరో రోజు ఉండడానికి ఉపయోగించుకుంటారు. ఇంకో 250 గదులు దాతలకు కేటాయిస్తారు. మిగిలినవాటిని కరెంట్ బుకింగ్ కింద ఇస్తారు. ప్రస్తుతం 1200 గదుల్లో పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. దీంతో సరిపడా గదులు లేక భక్తులు రోడ్లపైనే నిద్రపోవాల్సి వస్తోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం అనేది భక్తులకు సెంటిమెంట్ తో కూడుకున్నది అందుకే వీలైనంత ఎక్కువమందికి, వేగంగా దర్శనం కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. మరి టీటీడీ వీరి మొర ఆలకిస్తుందో లేదో చూడాలి.