Site icon HashtagU Telugu

Nara Lokesh: జ‌నసేన‌పై లోకేష్ చాణ‌క్యం!

Lokesh And Pavan

Lokesh And Pavan

తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ 2024 దిశ‌గా ప‌క్కా ప్లాన్ తో వెళుతున్నాడు. సింహం ఒంట‌రిగా గెలుస్తుంద‌ని నిరూపించ‌డానికి టీడీపీ స‌మాయాత్తం చేస్తున్నాడ‌ట‌. వ‌న్ సైడ్ ల‌వ్ ను చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్టిన త‌రువాత జ‌న‌సేన వాల‌కం భిన్నంగా ఉంది. రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేయాల‌ని ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. అందుకు నిద‌ర్శ‌నంగా ఇటీవ‌ల హైద్రాబాద్ లో జ‌రిగిన కాపు నేత‌ల స‌మావేశం నిలుస్తోంది. ఇవ‌న్నీ గ‌మ‌నించిన త‌రువాత లోకేష్ మ‌రో కోణం నుంచి వెళుతున్నాడ‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. జ‌న‌సేనతో పొత్తులేకుండా ఎన్నిక‌ల‌కు వెళ్లినా…2024 గెలుపు త‌థ్య‌మ‌ని ఆయ‌న స‌ర్వేల సారాంశమ‌ని తెలుస్తోంది.

మాస్ లీడ‌ర్ గా ఎదిగిన నేటిత‌రం యువ‌నాయ‌కునిగా టీడీపీ క్యాడ‌ర్ లోకేష్ ను బ‌లంగా విశ్వ‌సిస్తోంది. మ‌రోసారి ప్ర‌తిప‌క్షంలో కూర్చున్నా..ప‌ర్వాలేదుగానీ జ‌న‌సేన‌తో పొత్తు వ‌ద్ద‌నే సంకేతం ఆయ‌న అనుచ‌రుల నుంచి బ‌లంగా వెళుతోంద‌ట‌. ప్ర‌స్తుతం బీజేపీ తో క‌లిసి ఉన్న జ‌న‌సేన సిద్ధాంత ప‌రంగా న‌డ‌వ‌డంలేద‌ని ఇటీవ‌ల బీఎస్పీ పార్టీ క‌న్వీనర్ డాక్ట‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఏ మాత్రం సంస్థాగ‌త నిర్మాణం లేకుండా పార్టీని 2014 ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ప‌వ‌న్ న‌డిపిస్తున్నాడు. ఈ ఏడేళ్ల కాలంలో బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీల‌తో పొత్తు వివిధ సంద‌ర్భాల్లో జ‌నసేన న‌డిపింది. ఆయా పార్టీల‌కు జ‌న‌సేన మ‌ద్ధ‌తు కార‌ణంగా క‌లిసొచ్చిన సంద‌ర్భాలు లేవు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వేదిక‌ను పంచుకున్న‌ప్ప‌టికీ ఆనాడు మోడీ హ‌వా మాత్ర‌మే ప‌నిచేసింద‌ని టీడీపీ తాజా అంచ‌నా. అందుకే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డానికి ఎవ‌రూ ఇప్పుడు ముందుకు రావ‌డంలేద‌ని లోకేష్ అభిమానుల అంత‌ర్గ‌త చ‌ర్చ‌.
గ‌త ఎన్నిక‌ల చ‌రిత్ర‌ను తీసుకుని జ‌న‌సేన తో పొత్తు ప్ల‌స్సా లేక మైన‌స్సా అనే కోణం నుంచి క్షేత్ర‌స్థాయి అధ్య‌య‌నం మ‌రోసారి లోకేష్ టీం చేస్తుంద‌ని తెలుస్తోంది. వాస్త‌వంగా ఏపీ రాజ‌కీయాలు సామాజిక‌వ‌ర్గం ప్రాతిప‌దిక‌గా ఫోక‌స్ అవుతూ ఉంటాయి. కాపుల‌కు ప్రాధాన్యం ఇస్తే..బీసీలు దూరం అయ్యే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఇప్ప‌టికే బీసీ ఓటు బ్యాంకును భారీగా టీడీపీ జార‌విడుచుకుంది. దానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణాల్లో కాపు రిజ‌ర్వేష‌న్లు ఒకటి. తొలి నుంచి వెనుక‌బ‌డిన వ‌ర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ‌. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ హ‌యాం నుంచి క‌మ్మ సామాజిక‌వ‌ర్గం కంటే వెనుక‌బ‌డిన వ‌ర్గాలు ఆ పార్టీకి పెట్ట‌ని కోట‌. ప్ర‌త్యేకించి ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో కాపుల‌తో ఢీ అంటే ఢీ అనేలా రాజ‌కీయాలు న‌డిపే స‌త్తా యాద‌వుల‌కు ఉంది.

ఎస్సీ సామాజిక వ‌ర్గాల్లో మాదిగ‌లు ఎక్కువ‌గా టీడీపీ వైపు ఉంటారు. ఇటీవ‌ల మాల‌లు కూడా మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ వెంట న‌డుస్తున్నారు. ఫ‌లితంగా ఎస్సీలు టీడీపీ వైపు మొగ్గుతున్నార‌ని ఆ పార్టీ చేయించిన స‌ర్వేల్లోని అంచ‌నా. ఇక కాపులు సాధార‌ణంగా జ‌న‌సేన వైపు ఎక్కువ‌గా ఉంటారు. కానీ, ఇటీవ‌ల ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రూపంలో కాపుల‌కు మ‌రో పార్టీ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఆ క్ర‌మంలో జ‌న‌సేన వ‌ల‌న టీడీపీకి వ‌చ్చే లాభం కంటే న‌ష్టం ఎక్కువని లోకేష్ టీం వేస్తోన్న అంచ‌నా. కాపులు కొత్త పార్టీ పెట్ట‌కుండా జ‌న‌సేన వైపు ఉంటారా? అనే దానిపై ఇప్ప‌ట్లో క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ లేదు. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేకు వ‌చ్చిన ఓట్లు బేరీజు వేసుకుంటే..ఆ పార్టీ వ‌ల్ల తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒరిగేది ఏమీలేదు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంటుంది. ఆ ఓట్లు ఎక్కువ‌గా తెలుగుదేశం వైపు ఉండే ఛాన్స్ ఉంది. జ‌న‌సేన మీద న‌మ్మ‌కంతో అటు వైపు వెళ్లే ఓట‌ర్లు త‌క్కువ‌గా ఉంటార‌ని లోకేష్ టీం స‌ర్వేల్లోని సారాంశం. సో..పొత్తు కోణం నుంచి చూసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా వ‌చ్చే లాభం ఏమీ క‌నిపించ‌డంలేద‌ట‌. స‌రిగ్గా ఇలాంటి ఈక్వేష‌న్ల క్ర‌మంలో పొత్తుపై లోకేష్ రివ‌ర్స్ అవుతున్నాడ‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌. కానీ, చంద్ర‌బాబు మాత్రం ప‌వ‌న్ మీద న‌మ్మ‌కంగా ఉన్నాడ‌ట‌. ప‌లితంగా తండ్రీకొడుకుల మ‌ధ్య ఈ అంశం సీరియ‌స్ గా న‌లుగుతోంద‌ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ వ‌ర్గాల వినికిడి. ఫైన‌ల్ గా ఏమి చేస్తారోన‌ని..ఆ పార్టీలోని సీరియ‌ర్లు సైతం ఆస‌క్తిగా చూస్తున్నారు.