RGV Meets Perni Nani : జ‌గ‌న్ రాజ్యంలో ‘వ‌ర్మ’ రాజు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ, ఏపీ ప్ర‌భుత్వం న‌డుమ ఏం జ‌రుగుతుంది? ఆయ‌న‌తో ఎందుకు మంత్రి పేర్ని నాని భేటీ అయ్యాడు? ఏ హోదాను చూసి వ‌ర్మ‌ను చ‌ర్చ‌ల‌కు వ‌ర్మ‌ను ఆహ్వానించింది? ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు సినిమాలు తీసినందుకు జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ర్మ‌ను ప్ర‌త్యేకంగా గుర్తించిందా?

  • Written By:
  • Updated On - January 10, 2022 / 05:26 PM IST

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ, ఏపీ ప్ర‌భుత్వం న‌డుమ ఏం జ‌రుగుతుంది? ఆయ‌న‌తో ఎందుకు మంత్రి పేర్ని నాని భేటీ అయ్యాడు? ఏ హోదాను చూసి వ‌ర్మ‌ను చ‌ర్చ‌ల‌కు వ‌ర్మ‌ను ఆహ్వానించింది? ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు సినిమాలు తీసినందుకు జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ర్మ‌ను ప్ర‌త్యేకంగా గుర్తించిందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు రావ‌డం స‌హజం. స‌మాచార‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని, వ‌ర్మ భేటీ అధికారిక‌మా? వ‌క్తిగ‌త‌మా? అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.ఆన్ లైన్ టిక్కెటింగ్‌, ధ‌ర‌ల నియంత్ర‌ణపై జీవో నెంబ‌ర్ 142, జీవో నెంబ‌ర్ 35ల‌ను ప్ర‌భుత్వం గ‌త ఏడాది జారీ చేసింది. ఆ రోజు నుంచి టాలీవుడ్, ఏపీ స‌ర్కార్ న‌డుమ ప్రచ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. రిప‌బ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. సామాజిక కోణాన్ని ఆ జీవోలకు అంటించాడు. దీంతో సామాజిక కోణం దిశ‌గా వివాదం వెళ్లింది. ఆ క్ర‌మంలో ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్‌, దిల్ రాజు ఇత‌ర సినీ పెద్ద‌లు కొంద‌రు స్పందించారు. మంత్రి పేర్ని నానితో భేటీ కూడా అయ్యారు. అంత‌కు ముందు సినీ పెద్ద‌లుగా హీరోలు చిరంజీవి, నాగార్జున‌, దిల్ రాజు, రాజ‌మౌళి త‌దిత‌ర‌లు ఒక టీంగా వెళ్లి సీఎంజ‌గ‌న్‌ను క‌లిశారు. ఆ సంద‌ర్భంగా సినిమా టిక్కెట్లు, ఆన్ లైన్ ప‌ద్ధ‌తి అంశంపై చ‌ర్చ జ‌రిగింది. అందుకు సంబంధించిన రాత‌పూర్వ‌క ప్ర‌తిని కూడా మంత్రి పేర్ని నాని చూపించాడు.

ఆ జీవోల ప్ర‌కారం థియేట‌ర్ల‌ను న‌డ‌ప‌లేమ‌ని కొంద‌రు మూసివేశారు. మ‌రికొన్నింటిని నిబంధ‌న‌ల ప్ర‌కారం లేవ‌ని ప్ర‌భుత్వం సీజ్ చేసింది. దీంతో గంద‌ర‌గోళం న‌డుమ పెద్ద హీరోల సినిమాలను సంక్రాంతికి విడుద‌ల నుంచి వాయిదా వేసుకున్నారు. ఇలాంటి సీరియ‌స్ అంశంపై స్పందించ‌కుండా సినీ పెద్ద‌లు మౌనంగా ఉన్నారు. మా అధ్యక్షుడు సైలెంట్ గా ఉన్నాడు. సినిమా నిర్మాత‌లు కూడా మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు. ఎవ‌రూ ధైర్యంచేసి జ‌గ‌న్ స‌ర్కార్ జీవోల మీద ముఖాముఖి మాట్లాడేందుకు ధైర్యం చేయ‌లేదు. కానీ, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ మాత్రం ఈ ఇష్యూని భుజాన వేసుకున్నాడు. కొన్ని రోజులుగా మీడియా ముఖంగా జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లకు దిగాడు. సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ ప‌లు ర‌కాలుగా వీడియోల‌ను విడుద‌ల చేశాడు. సీఎం జ‌గ‌న్ నుంచి మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాద‌వ్‌, కొడాలి నాని త‌దితుల‌పై రెచ్చిపోయాడు.

మీడియాలో వ‌ర్మ చేస్తోన్న కామెంట్ల‌ను త‌ట్టుకోలేక మంత్రి పేర్ని నాని స్పందించాడు. భేటీకి రావాల‌ని ఆహ్వానించాడు. స‌రిగ్గా ఇక్క‌డే మంత్రి వాల‌కం వివాద‌స్ప‌దం అవుతోంది. సాధార‌ణంగా సినీ పెద్ద‌లు, మా అధ్యక్షుడు , ఏపీఎండీసీ ప్ర‌తినిధులు త‌దిత‌రుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించాలి. కానీ ఈ వివాదంతో ప్ర‌త్య‌క్షంగా సంబంధంలేని వ‌ర్మ‌ను చ‌ర్చ‌ల‌కు పిల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. గ‌త కొన్నేళ్లుగా వ‌ర్మ సినిమాలు ఓటీటీల్లోనే విడుద‌ల అవుతున్నాయి. పైగా ఆయ‌న ఇటీవ‌ల తీసిన బూతు సినిమాలు థియేట‌ర్లకు రావ‌డంలేదు.2019 ఎన్నిక‌ల‌కు ముందుగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వ‌ర్మ డైరెక్ష‌న్లో నిర్మించారు. ఆ సినిమాకు వైసీపీ నేత‌లు కొంద‌రు పెట్టుబ‌డి పెట్టార‌ని ఆనాడు టాక్ వ‌చ్చింది. చంద్ర‌బాబును వీలున్నంత వ‌ర‌కు ఆ సినిమాలో డ్యామేజ్ చేశాడు. సినిమా రూపంలో వ‌ర్మ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని ఆనాడు టీడీపీ ధ్వ‌జ‌మెత్తింది. మ‌రో సినిమా `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` సినిమాకు వ‌ర్మ డైరెక్ష‌న్ చేశాడు. ఆ సినిమాలోనూ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ క‌థ‌నం న‌డిపాడు. అందుకు ఉడ‌తాభక్తిగా వైసీపీ నేత‌లు కొంద‌రు పెట్టుబ‌డి పెట్టార‌ని టీడీపీ అనుమానం. మొత్తం మీద 2019 ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఆయ‌న తీసిన సినిమాలు వైసీపీకి ఎంతో కొంత మేలు చేశాయి. ఆ స‌హాయాన్ని గుర్తించుకుని ఇప్పుడు వ‌ర్మ‌ను జ‌గ‌న్ స‌ర్కార్ ప‌త్యేకంగా ఆహ్వానించిందా? అనే అనుమానం స‌హ‌జంగా వ‌స్తుంది. లేదంటే వ‌ర్మ‌తో ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని టాలీవుడ్ లోని ఒక వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది. దీనికి ప్ర‌భుత్వం ఎలాంటి స‌మాధానం ఇస్తుందో చూద్దాం.!