Yuvagalam : ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమై నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మంగళవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొని కేక్ కట్ చేశారు. 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర, నాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ, ప్రజల్లో చైతన్యం నింపడంలోనూ అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించింది. నేడు లోకేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో, ఈ మూడేళ్ల ప్రస్థానాన్ని పార్టీ నేతలు ఒక ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణిస్తున్నారు.
Nara Lokesh Yuvagalam Padayatra
ఈ పాదయాత్ర గణాంకాలను పరిశీలిస్తే దీని ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది. కుప్పం నుండి మొదలై 11 ఉమ్మడి జిల్లాల మీదుగా 3,132 కిలోమీటర్ల మేర సాగిన ఈ ప్రయాణం 226 రోజుల పాటు కొనసాగింది. ఈ క్రమంలో లోకేశ్ 97 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చారు. కేవలం నడకకే పరిమితం కాకుండా 2,097 గ్రామాల ప్రజలతో మమేకమవ్వడం, ‘హలో లోకేశ్’ వంటి కార్యక్రమాల ద్వారా యువత, మహిళలు మరియు రైతులతో ముఖాముఖి నిర్వహించడం విశేషం. ఈ యాత్ర వెళ్లిన 97 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఏకంగా 90 స్థానాల్లో విజయం సాధించడం, యువగళం సృష్టించిన రాజకీయ ప్రభంజనానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్బంగా అభిమానులు , పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మరియు పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎండనక, వాననక లోకేశ్ పడ్డ కష్టమే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పునాది వేసిందని వారు కొనియాడారు. పాదయాత్రలో ప్రజలు ఇచ్చిన వినతులు, వారు ఎదుర్కొన్న సమస్యలే నేడు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నేతలు గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలు మరియు నాయకుల సందడితో టీడీపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది.
