Site icon HashtagU Telugu

Elephants: గజరాజుల భీభత్సం.. భారీగా పంట నష్టం!

Elephantes

Elephantes

అటవీ శాఖాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పలు పంటలను సాగు చేసే రైతులు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నప్పటికీ ఏనుగుల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. చిత్తురు జిల్లాలో నిత్యం గజరాజులు సంచరిస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. జిల్లాలోని వెంగళరాజుకండ్రిగ, నగరి మండలాల్లో మూడు రోజుల క్రితం సంచరించిన మూడు ఏనుగులు ఇప్పుడు తిరుపతికి సమీపంలోని రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని గ్రామాల్లో ప్రజలు, రైతులను భయాందోళనకు గురిచేస్తాయి. పలమనేరు-కుప్పం ముక్కోణపు సరిహద్దులోని కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వారం రోజుల క్రితం వెళ్లిపోయిన ఏనుగులు ఈ ప్రాంతంలోని నాలుగు మండలాల్లోని దాదాపు డజను గ్రామాల్లో పంటలపై దాడులు చేస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలాయి.

జిల్లాకు పశ్చిమాన ఉన్న కౌండిన్య అభయారణ్యం నుండి మూడు ఏనుగులు జిల్లాకు తూర్పు వైపుకు చేరుకోవడానికి 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించాయి. వెంగళరాజుకండ్రిగ, నగరి మండలాలకు చేరుకుని వారం రోజులుగా పక్కనే ఉన్న పొలాల్లోని పంటలపై దండయాత్ర చేసి మామిడి తోటల్లోని చెట్లను నేలకూల్చాయి. ఏపీలోని నగరి మీదుగా, నెమ్మదిగా రేణిగుంట మండలంలోకి తరలివెళ్లిన ఈ మంద మంగళవారం ఏర్పేడు మండలంలోని వికృతమల, గుడిమల్లం, కుక్కలగుంట తదితర ప్రాంతాలకు చేరుకుని శ్రీకాళహస్తి సరిహద్దుకు చేరుకున్నాయి.

ఏనుగులు మామిడి తోటను ధ్వంసం చేశాయని, లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఏర్పేడు మండలం వికృతమాల రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు. మునగలపాళెంకు చెందిన మరో రైతు కూడా వరి పంటను కోల్పోయిన బాధతో కంటతడి పెట్టాడు. అయితే ఏనుగుల వల్ల పంట నష్టపోయామని ఫిర్యాదు చేసిన రైతులకు పరిహారం అందజేస్తామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు.  “ఏనుగుల గుంపు నివాసాలలోకి వెళ్లకుండా నిరోధించడానికి మేం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాటిని విడిపోయిన మందతో తిరిగి కలపడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం వాచర్లు, ట్రాకర్లను ఏర్పాటుచేశామని, ప్రస్తుతం చెల్లూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలోకి మళ్లించామని చెప్పారు.

Exit mobile version