Site icon HashtagU Telugu

AP Assembly: అసెంబ్లీలో మ‌ళ్లీ మూడు రాజ‌ధానులు

186517 Jagan

186517 Jagan

ఏపీ అసెంబ్లీ, హైకోర్టు మ‌ధ్య ప్ర‌త్య‌క్ష యుద్ధానికి తెర‌లేచింది. రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ అసెంబ్లీ చ‌ర్చించింది. చ‌ట్టాల‌ను మార్పు చేఏ అధికారం ప్ర‌భుత్వానికి లేద‌ని హైకోర్టు ఇచ్చిన స్టేట్ మెంట్ పై ఏపీ ప్ర‌భుత్వం ధ్వ‌జ‌మెత్తింది. గ‌త ప్ర‌భుత్వాల లోపాల‌ను స‌రిచేసుకునే అధికారం ప్ర‌స్తుతం ఉండే ప్ర‌భుత్వానికి ఉంద‌ని సుప్రీం కోర్టు చెప్పిన తీర్పుల‌ను మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కోడ్ చేశాడు. అంతేకాదు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పును అవ‌లోక‌నం చేస్తూ రాజ్యాంగ పరిధుల‌ను న్యాయ‌స్థానాలు దాట‌కూడ‌ద‌ని సున్నితంగా మంద‌లించాడు.
మూడు రాజ‌ధానుల అంశం మ‌రోసారి ఏపీ అసెంబ్లీ వేదిక‌గా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన బిల్లుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ ఎండ‌గ‌ట్టింది. శాస‌న‌, న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌కు ఉండే ప‌రిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం గుర్తు చేసింది. చ‌ట్టాల‌ను చేసే అధికారం శాస‌న వ్య‌వ‌స్థ‌కు రాజ్యాంగ ఇచ్చింద‌ని, ఆ మేర‌కు రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్స్ ను ధ‌ర్మాన కోడ్ చేశాడు. అసెంబ్లీ చేసే చ‌ట్టాలు చెల్లుబాటు కాద‌ని హైకోర్టు చెప్ప‌డం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని ఏపీ అసెంబ్లీ భావించింది. ప్ర‌జా స్వామ్యంలో రాజ్యాంగం బ‌ద్ధంగా అసెంబ్లీ ఏర్ప‌డింది. దానికి రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులు, బాధ్య‌త‌లు ఉన్నాయ‌నే విష‌యాన్ని స‌భ్యుడు గుర్తు చేశాడు.
మూడు రాజ‌ధానుల బిల్లును కొట్టివేస్తూ మార్చి మూడో తేదీన ఏపీ హైకోర్టు జ‌గ‌న్ స‌ర్కార్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. అమ‌రావ‌తి రాజ‌ధానికి వ్య‌తిరేకంగా చేసిన చ‌ట్టం చెల్ల‌ద‌ని తీర్పు చెప్పింది. ఆ క్ర‌మంలో సీనియ‌ర్ వైసీసీ లీడ‌ర్ ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఏపీ జ‌గ‌న్ కు ఒక లేఖ రాశాడు. హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు, తీర్పుపై అసెంబ్లీలో చ‌ర్చ‌కు అనుమ‌తించాల‌ని కోరాడు. ఆ మేర‌కు గురువారం మూడు రాజ‌ధానులు, హైకోర్టు తీర్పు అనే అంశంపై ఏపీ అసెంబ్లీ చ‌ర్చ కు అనుమ‌తించింది. ఆ అంశంపై ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సుదీర్ఘంగా మాట్లాడాడు.
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్ట్ తీర్పు ప్ర‌కారం సీఆర్డీఏ చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలి. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని తీర్పు చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ మేరకు తీర్పు చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని.. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలనె సూచింది. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని పేర్కొంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం గురువారం అసెంబ్లీలో చ‌ర్చ‌కు అనుమ‌తించింది. ఆ సంద‌ర్భంగా ధ‌ర్మాన వినిపించిన వాద‌న ఇలా ఉంది…“ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు ఆధారంగా ప్ర‌భుత్వాలు రాజ్యాంగ బ‌ద్ధంగా ఏర్ప‌డ‌తాయి. గ‌త ప్ర‌భుత్వాలు చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునే వెసుల‌బాటు కొత్త ప్ర‌భుత్వానికి రాజ్యాంగం క‌ల్పించింది. ఆ మేర‌కు సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వం చేసిన సీఆర్డీయే చ‌ట్టం ప్ర‌కారం చేయాల‌ని హైకోర్టు ఎలా చెబుతుంది? ఆ అధికారం హైకోర్టుకు ఉందా? ప్ర‌జా స్వామ్య‌బ‌ద్ధంగా ఏర్ప‌డిన ప్ర‌భుత్వానికి చ‌ట్టాలు చేసే అధికారం లేదంటే ఎలా?..మూడు రాజ‌ధానులు ఏర్పాటు ఏపీకి అనివార్యం. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, ఆంధ్రా ప్ర‌జ‌ల మ‌ధ్య వైరుధ్యాలు ఉన్నాయి. భౌగోళికంగా , సాంస్కృతికంగా కూడా వ్య‌త్యాసాలు ఉన్నాయి. అందుకే, గ‌త ప్ర‌భుత్వం చేసిన చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన అధికార వికేంద్రీక‌ర‌ణ దిశ‌గా ప్ర‌స్తుత ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దానికే క‌ట్టుబ‌డి ఉంటుంది..“ అంటూ ఆయ‌న అసెంబ్లీ వేదిగా వినిపించాడు.
శాస‌న‌, న్యాయ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య చాలా సంద‌ర్భాల్లో ఇలాంటి గ్యాప్ నెల‌కొంది. దీనిపై జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గాల‌ని ధ‌ర్మాన అభిప్రాయ‌ప‌డ్డాడు. పార్ల‌మెంట్ వేదిక‌గా కూడా ఈ తీర్పుపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని కోరాడు. శాస‌న వ్య‌వ‌స్థ‌పై న్యాయ వ్య‌వ‌స్థ ఆధిపత్య‌ధోర‌ణి రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు భంగ‌మంటూ ధ‌ర్మాన్ ఫైర్ అయ్యాడు. ఇలాంటి సున్నిత‌మైన అంశానికి శాశ్వ‌తంగా తెర‌దించాలంటే. జాతీయ స్థాయి చ‌ర్చ అవ‌స‌ర‌మ‌ని అన్నాడు. ఆ సంద‌ర్భంగా మూడు రాజ‌ధానుల ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కి చెప్పాడు. అంతేకాదు, మూడు రాజ‌ధానుల‌కు ఏపీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని. అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించ‌డంతో అమ‌రావ‌తి క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింద‌న్న‌మాట‌. !