కూల్చివేతలతో ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలగోట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బుధవారం విజయవాడ కి చెందిన వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ మాజీ సభ్యులు పూజల సాయికృష్ణఆజాద్,పాలడుగు నగేష్ ,వెంకటేష్ సహ పలు జిల్లాకి చెందిన నాయకులు తోట సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
ప్రజా సమస్యలు పట్టని పాలకులు ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకే ప్రాధాన్యమివ్వడం దురదృష్టకరమన్నారు.ఎంతో విలువైన సహజ సంపదని దోచుకుంటూ వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. సిఎం జగన్ ప్రత్యేక హోదా,విభజన హామీలు సాధించకుండా కేంద్రంలోని బిజెపి సర్కార్ కు సాగిలపడిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఓ వైపు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఎపిలో పాలకులు కులరాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళుతున్న బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కు ఎపి ప్రజానీకం నీరాజనాలు పలుకుతున్నారని స్పష్టం చేశారు.
Also Read: Kushi Trailer: ఖుషి ట్రైలర్ రిలీజ్, విజయ్, సమంత కెమిస్ట్రీ అదుర్స్!