Mahanadu Menu: గట్టిగానే వడ్డిస్తున్నారుగా.. మహానాడులో పెట్టే మెనూ ఇదే

ఒంగోలులో టీడీపీ నిర్వహించే మహానాడు కోసం గట్టి ఏర్పాట్లే చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తల కోసం నోరూరించే వంటకాలు ప్రిపేర్ చేయిస్తున్నారు.

  • Written By:
  • Updated On - May 19, 2022 / 11:34 AM IST

ఒంగోలులో టీడీపీ నిర్వహించే మహానాడు కోసం గట్టి ఏర్పాట్లే చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తల కోసం నోరూరించే వంటకాలు ప్రిపేర్ చేయిస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఆ తరువాత స్నాక్స్, రాత్రికి డిన్నర్. వీటికి తోడు డ్రింకులు, ఐస్ క్రీములు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈసారి విందులో ప్రత్యేకత ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాలను టచ్ చేసేలా కొన్ని ప్రత్యేక వంటకాలు వండిస్తున్నారు. పచ్చళ్లు, వెరైటీలతో ఆయా ఊర్లు, ప్రాంతాల పేర్లు వినిపించేలా ప్లాన్ చేస్తున్నారు. టిఫిన్‌లో భాగంగా ఇడ్లీ, వడ, నేతి జీడిపప్పు ఉప్మా, కర్నూలు వేరుశెనగ పచ్చడి, అల్లం పచ్చడి, కోనసీమ కొబ్బరి పచ్చడి, కొబ్బరి కారం, నల్ల కారం, అరకు కాఫీ, మసాలా టీ ఇస్తారు.

ఇక మధ్యాహ్నం లంచ్ మెనూలో.. మిక్శెడ్ వెజిట‌బుల్ బుర్జి, కరివేపాకు కోడి వేపుడు, ఆంధ్ర వెజిటబుల్ ఖీమా  పులావ్, విజయవాడ కోడి బిర్యానీ, నాటుకోడి పులుసు, హైదరాబాద్ మటన్ ధమ్ బిర్యానీ, భీమవరం రొయ్యల కూర, చపాతీ, పన్నీర్ బట్టర్ మసాలా, బాపట్ల సోనా మసూరి అన్నం, ఆదోని ముద్ద పప్పు, మంగళగిరి సొరకాయ పులుసు, గుంటూరు పెరుగు చారు, బెండకాయ పకోడీ, గుంటూరు పప్పు చారు, పూత వడియాలు, పెరుగుఅన్నం, ఊర మిరపకాయలు, హైదరాబాద్ తీపి కిళ్లీతో విందు భోజనం వడ్డిస్తారు. వీటికి తోడు కొత్త ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, గోదావరి రొయ్యల పచ్చడి, విజయవాడ మటన్ పచ్చడి, గుంటూరు కోడి పచ్చడి విందుకు అదనం.

మధ్యాహ్నం అన్నం తిన్నాక.. సాయంత్రానికి మళ్లీ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. ఉల్లి సమోసా, కార బూందీ, మసాలా టీ, సాల్ట్ బిస్కెట్స్, జీరా బిస్కెట్స్ అందుబాటులో ఉంచుతున్నారు. అసలే ఎండలు మండిపోతుండడంతో.. వచ్చే వారి కోసం సపోటా ఐస్ క్రీం, మలై కుల్ఫీ, వెనిల్లా ఐస్ క్రీం, చాక్లెట్ ఐస్ క్రీం, ఇక మాంగో ఫెలూదా, రోజ్ ఫెలూదా, డ్రైఫ్రూట్ ఫెలూదా, చెరుకు రసం, మాంగో లస్సీ, సపోటా లస్సీ కూడా సిద్ధంగా
ఉంచుతున్నారు.