Site icon HashtagU Telugu

Polavaram Issue: పోలవరం ఆలస్యానికి అసలు కారణమిదే!

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా చెప్పే పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి అసలు కారణాలు వెలుగుచూశాయి. ఇందులో ప్రధాన కారణం మాత్రం.. ప్రాజెక్టు కాంట్రాక్టర్ ను మార్చడమే అని తేలింది. ఇక రాష్ట్రం ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో కేటాయిస్తున్న మొత్తంలో 30 శాతమే ఖర్చు చేస్తుండడం కూడా మరో కారణంగా మారింది. కేంద్రం చేసే రీయింబర్స్ మెంట్ లోనూ సమస్యలు వెలుగుచూస్తున్నాయి.. ఇదంతా ఐఐటీ హైదరాబాద్ నిపుణుల పరిశీలనలో తేలిన నిజాలు. ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా మానవ వనరులు లేవు. పనులను వేగవంతం చేసేలా కావలసిన వ్యూహం, దాని అమలును చూసేలా ఉన్నత స్థాయిలో అధికారులే కరువయ్యారు. వివిధ సంస్థల మధ్య కోఆర్డినేషన్ కూడా కరువైంది. యంత్రసామగ్రి కొరత కూడా వేధిస్తోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనలను అమలును సరైన సమయంలో అమలు చేయకపోవడం వల్లా నష్టం తప్పడం లేదు.

పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా సాగుతున్నాయో పర్యవేక్షించే మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇంతపెద్ద ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో రికార్డులు కచ్చితంగా మెయింటైన్ చేయాలి. కానీ ఆ పనిని చేతిరాతతోనే కానిచ్చేస్తున్నారు. ఆ నివేదికలు అలాగే ఉన్నాయి. దీంతో అందులో లోటుపాట్లను గుర్తుపట్టడం కష్టమవుతుంది. వీటిని ఎందుకు కంప్యూటరైజ్ చేయడం లేదో అర్థం కాని విషయం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యంగా జరుగుతోంది. అందుకే దానికి కారణాలను అన్వేషిస్తూ.. పరిష్కారాలను సూచించడానికి వీలుగా థర్డ్ పార్టీతో అధ్యయనం చేయించింది.. ప్రాజెక్టు అథారిటీ. ఆ బాధ్యతలను హైదరాబాద్ ఐఐటీ నిపుణులకు అప్పగించారు. వాళ్లు తమ రిపోర్ట్ ను 2021 నవంబర్ లోనే అథారిటీకి ఇచ్చేశారు. కానీ ఆ విషయం ఈమధ్యనే వెలుగుచూసింది.