Site icon HashtagU Telugu

Fact check: రామ మందిరంలో క్రైస్తవ ప్రార్ధ‌నలు.. అస‌లు నిజం ఇదే..!

Ram Temple

Ram Temple

ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామ మందిరాన్ని పాస్టర్ అక్రమంగా ఆక్రమించుకుని అక్కడ క్రైస్తవ ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారని పలువురు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా పామర్రు మండలం కె గంగవరం గ్రామంలో తాళం వేసి ఉన్న రామ మందిరం ప్రక్కనే జరుగుతున్న ప్రార్థన సభకు సంబంధించిన వీడియోను పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు.

ఈ క్ర‌మంలో ఆలయాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించారని, దీంతో నేరస్థులను వెంట‌నే అరెస్టు చేయాలని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. అయితే రాముడిని అవ‌మానించార‌ని బీజేపీ నేత‌లు షేర్ చేసిన వీడియో పై తూర్పుగోదావ‌రి పోలీసులు స్పందించారు. ఇక తాజాగా ఈ వివాదంపై స్పందించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు అక్క‌డ రామ మందిరంలో అలాంటివి జ‌ర‌గ‌లేద‌ని, కొంద‌రు కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

ఇక అక్క‌డ రాముని ఆలయంలో ప్రతిరోజూ పూజలు జరుగుతున్నాయని అక్క‌డి పోలీసులు తెలిపారు. ముఖ్యంగా అక్క‌డి స్థానిక హిందువులు మరియు క్రైస్తవుల మధ్య ఎటువంటి వివాదాలు లేవని, గ్రామంలోని రెండు వర్గాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మార్చి 30, బుధవారం ప్రార్థనలు జరుగుతుండగా, కాకినాడలో నివసిస్తున్న మంగాయమ్మ ప్రార్థన సమావేశాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుందంటూ, మంగాయమ్మ పెద్ద కుమారుడు శ్రీనివాస్ తన తల్లితో గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు.

దీంతో మంగాయమ్మ, మరికొందరు పామర్రు పోలీసులకు ఫోన్ చేయడంతో, అక్క‌డి స్థానిక‌ పోలీసులు వెళ్లి సమస్యను సద్దుమణిగించారు. అయితే అదే గ్రామంలో నివసిస్తున్న శ్రీనివాస్ బంధువు వెంకట రమణ పోలీసులకు చేసిన కాల్‌పై పగ పెంచుకుని, ప్రార్థన సమావేశాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నించిన శ్రీనివాస్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశార‌ని, త‌న‌ సోష‌ల్ మీడియాలో ఉద్దేశ‌పూర్వ‌కంగా మ‌త విద్వేషాల‌ను రెచ్చగొట్టేందుకు వెంక‌ట ర‌మ‌ణ‌ త‌ప్పుడు స‌మాచారం పోస్ట్ చేశాడ‌ని పోలీసులు తెలిపారు.

ఇక అంతకుముందు ఏప్రిల్ 1వ తేదీన ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీలు రామమందిరాన్ని ఆక్రమించుకుని, అక్క‌డ‌ క్రైస్తవ ప్రార్థనలు చేస్తున్నార‌ని ఓ ఫేక్ న్యూస్ వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా దీన్ని ప్రశ్నించిన హిందువులపై, పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు.

అధికార వైసీపీ ప్ర‌భుత్వం హిందువుల‌కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుంద‌ని, రాష్ట్రంలో క్రైస్తవులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోప‌ణ‌లు చేశారు. ఇక‌పోతే గ‌తంలో కూడా ఏపీలో జ‌గన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి, ప్ర‌తిప‌క్ష పార్టీలు అయిన‌ బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌లు.. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడుల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేశాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడుల‌కు సంబంధించిన ఆధారాలు ప్ర‌తిప‌క్షాలు బ‌య‌ట‌పెట్ట‌లేక‌ పోయాయి.