Amaravati కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29 వేల మంది రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానించారని, మహిళలను కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణులను బూట్ల కాళ్లతో తన్నారని, వారి భోజనంలో ఇసుక పోసి హింసించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాదిరాళ్లుగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్ర భవిష్యత్తును, ఐదేళ్ల అమూల్యమైన కాలాన్ని వృథా చేసిందని ఎంపీలు ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు గ్రోత్ ఇంజన్లుగా ఉన్నాయని, ఏపీకి కూడా అలాంటి ఒకే ఒక్క శక్తిమంతమైన రాజధాని అవసరమని వారు నొక్కిచెప్పారు. రాజధానిని నిర్ణయించే అధికారం కేవలం పార్లమెంటుకే ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు గుర్తుచేశారు. ఈ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఉన్న అన్ని రకాల ఊహాగానాలకు తెర పడుతుందని, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగి రాష్ట్ర అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
