ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నడిపేందుకు కృషి చేస్తున్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వ పరిపాలనలో వేగాన్ని పెంచే చర్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఎనిమిది నెలలు పూర్తి కావస్తోందని, ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరించి, కూటమికి పూర్తి మెజారిటీతో అధికారాన్ని అప్పగించారని గుర్తు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, వాటిని మళ్లీ గాడిలో పెట్టడం తన ముందున్న అతిపెద్ద సవాలుగా పేర్కొన్నారు.
Mobile Recharge Rs 50000: నెలవారీ రీఛార్జ్ రూ.50వేలే.. ఆస్తులు అమ్ముకుంటే సరిపోద్ది !
ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫైళ్లు ఏ కారణాల వల్ల ఆలస్యం అవుతున్నాయో సంబంధిత శాఖల అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్థిక సంబంధిత ఫైళ్లు కూడా అవసరమైన సమీక్షల అనంతరం త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ సమర్పించిన నివేదిక ప్రకారం.. కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు మూడు రోజుల్లోనే క్లియర్ అవుతున్నాయి. కానీ మరికొన్ని శాఖల్లో మాత్రం ఫైళ్లకు నెలల తరబడి ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ఇది పరిపాలనా వ్యవస్థలో అడ్డంకిగా మారుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అధికారులు ఫైళ్లను అనవసరంగా నిలిపివేయకుండా, అవి సమయానికి పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థంగా నడిపేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.