AP Alliance: 2024 కూట‌మి ఇదే..?

ఏపీలోని పొలిటిక‌ల్ చిత్రం స్ప‌ష్ట‌త‌కు వ‌స్తోంది. అందుకు సంబంధించిన సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల అనేకం జ‌రిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంకు వెళ్ల‌డం పొత్తుకు బ‌లాన్ని ఇచ్చే అంశం.

  • Written By:
  • Updated On - December 30, 2021 / 05:57 PM IST

ఏపీలోని పొలిటిక‌ల్ చిత్రం స్ప‌ష్ట‌త‌కు వ‌స్తోంది. అందుకు సంబంధించిన సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల అనేకం జ‌రిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంకు వెళ్ల‌డం పొత్తుకు బ‌లాన్ని ఇచ్చే అంశం. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ కీల‌క లీడ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతోన్న బుద్ధా వెంక‌న్న‌, బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌లు పొత్తుకు అనుకూలంగా ఉన్నాయి. తాజాగా పొలిట్ బ్యూరో స‌భ్యుడు, శాస‌న మండ‌లి మాజీ చైర్మ‌న్ మ‌హ్మ‌ద్ అహ్మ‌ద్ ష‌రీఫ్ టీడీపీ, జ‌న‌సేన పొత్తు గురించి ప్ర‌స్తావించాడు.

మ‌హ్మ‌ద్ అహ్మ‌ద్ ష‌రీఫ్ తెలుగుదేశం పార్టీకి న‌మ్మ‌క‌స్తుడు. తొలి నుంచి పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్నాడు. ఎలాంటి ప‌ద‌వులు లేకుండా సుదీర్ఘ కాలం పార్టీకి సేవ చేశాడు. ముస్లిం మైనార్టీ వ‌ర్గానికి చెందిన ష‌రీఫ్ హైద్రాబాద్ కేంద్ర పార్టీ కార్యాల‌యంలో చాలా కాలం కీల‌కంగా ఉన్నాడు. కార్య‌క్ర‌మాల క‌మిటీ చైర్మ‌న్ గా చాలా కాలం పాటు ప‌నిచేశాడు. మీడియా వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడుగా కూడా ప‌నిచేశాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు. పార్టీ కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకునే స‌మ‌యంలో ష‌రీఫ్ చాలా సంద‌ర్భాల్లో ప్ర‌ధాన పాత్ర‌ను పోషించాడు.

కార్య‌క్ర‌మాల క‌మిటీ చైర్మ‌న్ గా ఉమ్మ‌డి ఏపీ వ్యాప్తంగా ఆయా లీడ‌ర్ల గురించి ర‌హ‌స్య నివేదికలు తయారు చేసి చంద్ర‌బాబుకు ఎప్ప‌టిక‌ప్పుడు అందించేవాడు. అంత‌టి ప్రాధాన్యం టీడీపీలో ష‌రీఫ్ కు ఉంది. అందుకే, ఆయ‌న్ను ఎమ్మెల్సీగా చేయ‌డంతో పాటు మండ‌లి చైర్మ‌న్ గా నియ‌మించాడు చంద్ర‌బాబు. మూడు రాజ‌ధానుల బిల్లు విష‌యంలో మండ‌లి కేంద్రంగా జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాలకు హుందాగా ఫుల్ స్టాప్ పెట్టిన రాజ‌నీతిజ్ఞుడు మ‌హ్మ‌ద్ ష‌రీఫ్‌. తాజాగా పొత్తు ప్ర‌స్తావ‌న చేయ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో గుర‌వారం ‘టీడీపీ గౌరవ సభ’ జ‌రిగింది. ఆ స‌భ‌కు హాజ‌రైన కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశాడు. రాబోవు 2024 ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలు, టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ, జ‌న‌సేన పొత్తుపై ఉన్న దోబూచులాట‌కు ఒక క్లారిటీ వ‌చ్చింది.

పొలిట్ బ్యూరో స్థాయి లీడ‌ర్ పొత్తు విష‌యాన్ని ప్ర‌స్తావించాడంటే ఖ‌చ్చితంగా దానిపై టీడీపీ అంత‌ర్గ‌త ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి ఉంటుంది. పైగా ష‌రీఫ్ నోట ఆ మాట వ‌చ్చిందంటే ఏ మాత్రం అనుమానించాల్సిన అవ‌స‌రం లేదు. ఆచితూచి మాట్లాడ‌డం ష‌రీఫ్ కు బాగా తెలుసు. మృధుస్వ‌భావిగా పేరున్న ఆయ‌న టీడీపీ మేధావి వ‌ర్గం కింద చాలా మంది చూస్తుంటారు. అలాంటి ష‌రీఫ్ నోట పొత్తు అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందంటే చంద్ర‌బాబుకు తెలియ‌కుండా జ‌రిగి ఉంటుంద‌ని ఎవ‌రూ భావించ‌రు. సో..జ‌గ‌న్ స‌ర్కార్ ను ప‌డ‌గొట్టేందుకు వామ‌ప‌క్షాలు, టీడీపీ, జ‌న‌సేన కూట‌మి రెడీ అయింద‌న్న‌మాట‌.