పౌరాణిక నాటకాల్లో పురుషుడి పాత్రలు.. భళా అనిపిస్తున్న ఆంధ్రా మహిళ!

మేల్ యాక్టర్ స్త్రీపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం తేలికే. కానీ పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రను నటించడం స్త్రీ నటించి మెప్పించడం అంత తెలికేమీ కాదు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:17 PM IST

మేల్ యాక్టర్ స్త్రీపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం తేలికే. కానీ పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రను నటించడం స్త్రీ నటించి మెప్పించడం అంత తెలికేమీ కాదు. సత్య హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, అర్జునుడి పాత్ర ఏదైనా సరే.. చూస్తే ఔరా అనాల్సిందే. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగూడబా గ్రామానికి చెందిన 41 ఏళ్ల కొప్పర మంగాదేవి పౌరాణిక నాటకాల్లో అద్భుతంగా నటిస్తుంది. హరికథ, బుర్రకథ, తప్పెట గుళ్లు వంటి జానపద కళలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో తమ ప్రకాశాన్ని కోల్పోయినప్పటికీ, ఉత్తర ఆంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మంచి ఆదరణను పొందుతున్నాయి.

మంగాదేవి చాలా కాలంగా సత్య హరిచంద్ర పౌరాణిక నాటకంలో హరిచంద్ర ప్రధాన పాత్రను పోషిస్తూ తన నటన, గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. పౌరాణిక నాటకంలో పద్యాలను పురుష గాత్రంతో పాడటం కష్టమైనప్పటికీ, ఆమె అభ్యాసం, కృషి, నిబద్ధత, థియేటర్ పట్ల ఆసక్తి ఆమె ప్రదర్శన ప్రజల్ని మెప్పిస్తుంది. ఆమె ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,000కు పైగా స్టేజ్ షోలు ఇచ్చారు. మంగాదేవి ఏడో తరగతి చదువుతున్నప్పటి నుండి నాటకాల్లో నటించడం ప్రారంభించింది. ఆమె మొదటి పాత్ర హరిశ్చంద్రుని భార్య చంద్రమతి. అయినప్పటికీ, హరిశ్చంద్ర పాత్రను పోషించాలని ఆమె తండ్రి చిన్నం నాయుడు పట్టుబట్టడంతో, ఆమె ఆ పాత్రను ధరించి ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.

తరువాత ఆమె శ్రీ రామాంజనేయ యుద్ధం లో పురుష ప్రధాన పాత్రలు రాముని, గయోపాఖ్యానం నాటకాల్లో అర్జునుడి పాత్ర పోషించడం ప్రారంభించింది. ఆమె తన గురువు యడ్ల గోపాలరావు దర్శకత్వంలో సత్య హరిశ్చంద్ర కథ ఆధారంగా ఒక సినిమాలో కూడా నటించింది. అయితే, ఈ చిత్రం ఇంకా ప్రదర్శించబడలేదు.కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఒక నెల ముందు ఆమె 20 నుండి 25 స్టేజ్ షోలు ఇచ్చేది. ఇప్పుడు ఆమె నెలకు మూడు నుండి ఐదు స్టేజ్ షోలు మాత్రమే ఇస్తోంది. తాను చిన్నతనంలో తన తండ్రి కోరిక మేరకు హరిశ్చంద్ర పాత్రను పోషించానని మంగాదేవి తెలిపారు. తన కుటుంబ సభ్యుల సహకారంతో గత రెండున్నర దశాబ్దాలుగా పురుష పాత్రలు వేస్తున్నానని, పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రల్లో తన విజయంలో తండ్రి, భర్త కీలక పాత్ర పోషించారని ఆమె తెలిపారు.

తాను వేదికపైకి వచ్చినప్పుడు మగవాడిగా తన స్వరం ఎలా మారుతుందో అని కొన్నిసార్లు తానే ఆశ్చర్యపోతుంటానని… ఇది దేవుడి బహుమతిగా తాను భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. నాటకంలో ప్రధాన పురుష పాత్ర తాను పోషించానని తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. తన నటనకు ఇంప్రెస్ అయ్యి సినిమాలో నటించమని ఇటీవల ఒక నిర్మాత నుంచి తనకు ఆఫర్ వచ్చిందని…ఇప్పుడు స్టేజ్ ఆర్ట్ కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందినప్పుడే నాటక కళ అభివృద్ధి చెందుతుందని మంగాదేవి అభిప్రాయపడ్డారు.