Tomatoes Thief:రైతుబ‌జార్ లో ట‌మాటాలు ఛోరీ…!

ఇంట్లో బంగారం, డ‌బ్బులు చోరీ కావ‌డం విన్నాం, చూశాం కానీ రైతు బ‌జార్ లో ఉన్న ట‌మాటా ట్రేలు చోరీ కావ‌డం ఇప్పుడు అంద‌రికీ అశ్చ‌ర్యం క‌లుగుతుంది.

  • Written By:
  • Publish Date - November 28, 2021 / 12:17 PM IST

ఇంట్లో బంగారం, డ‌బ్బులు చోరీ కావ‌డం విన్నాం, చూశాం కానీ రైతు బ‌జార్ లో ఉన్న ట‌మాటా ట్రేలు చోరీ కావ‌డం ఇప్పుడు అంద‌రికీ అశ్చ‌ర్యం క‌లుగుతుంది. ప్ర‌స్తుతం ట‌మాట ధ‌ర కేజీ 100 నుంచి 130 రూపాయ‌లు ఉండ‌టంతో వీటిని కూడా దొంగ‌లు దోచుకెళ్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలు కూర‌గాయాల మార్కెట్ లోకి గురువారం అర్థ‌రాత్రి దొంగ‌లు చొర‌బ‌డి అత్యంత విలువైన మూడు ట‌మాట‌ల ట్రేలు ఎత్తుకెళ్లిపోయారు. వీటి విలువ మార్కెట్ లో ఏడు వేల రూపాయ‌లుగా ఉంది.

కూరగాయల దుకాణం వ్యాపారి ఉద‌యాన్నే షాపుకు వ‌చ్చిన త‌రువాత మూడు టమాటా ట్రేలు మాయమైనట్లు గుర్తించడంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. ఒక్కో ట్రేలో దాదాపు 20 కిలోల టమోటాలు ఉంటాయి. మార్కెట్‌ గురించి బాగా తెలిసిన వ్యక్తులు ఇది చేసి ఉంటార‌ని దుకాణ‌దారుడు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాడు. సాధారణంగా కూరగాయల నిల్వలు తెల్లవారుజామున 2 గంటలకు మార్కెట్‌కు చేరుకుంటాయి. రెక్సీ నిర్వహించిన తర్వాతే దుండగులు చోరీకి పాల్పడి ఉండవచ్చు అని వ్యాపారి తెలిపారు. అయితే దుకాణ‌దారుడు ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

రిటైల్ మార్కెట్‌లో టమోటా కిలో రూ.100 పైగా అమ్ముడవుతుండగా…శనివారం చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని హోల్‌సేల్ మార్కెట్‌లలో కూరగాయల ధరలు కిలో రూ.10కి పడిపోయింది. చిత్తూరులోని మదనపల్లె మార్కెట్‌తో పాటు కర్నూలులోని పత్తికొండ, ప్యాపిలి, ఆదోని మార్కెట్‌లలో వారం రోజుల క్రితమే టమాటా ధర రికార్డు స్థాయిలో రూ.150కి పెరిగింది. శనివారం హోల్ సేల్ మార్కెట్లలో టమాటకు అత్యధికంగా కిలో రూ.22 పలుకగా, దిగుబడి నాణ్యతను బట్టి అత్యల్ప ధర రూ.10 పలికింది.

కొద్దిరోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో త‌మ‌ సంతోషం అంతంత మాత్రంగానే ఉందని కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన టమోటా రైతు కె .రంగనాయకులు అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు త‌మ‌కు శాపంగా మారాయని…వ‌ర్షాల వ‌ల్ల‌ టమాటా నాణ్యత దెబ్బతిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు కూడా ప్యాకింగ్‌ చేయలేకపోతున్నామ‌ని పత్తికొండకు చెందిన వ్యాపారి మహబూబ్‌ సుభాన్‌ వాపోయాడు.

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని ప్రధాన మార్కెట్లలో ప్రస్తుతం సరిపడా కూరగాయల నిల్వలు అందుబాటులో ఉన్నాయని…ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌ నుంచి టమోటా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని పత్తికొండ మార్కెట్‌ యార్డు కార్యదర్శి ఎం.శ్రీనివాసులు తెలిపారు. అంతేకాకుండా కర్నూలు రకంతో పోలిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పండే ట‌మాటాలు నాణ్యమైనవిగా ఉన్నాయ‌ని తెలిపారు. కొద్దిరోజులుగా దాదాపు అన్ని హోల్‌సేల్ మార్కెట్‌లకు ట‌మాట లోడ్ లు పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో ట‌మాట ధ‌ర కిలో ఐదు రూపాయ‌ల‌కు ప‌డిపోయిన అశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని రైతులు అంటున్నారు.