Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడైన నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేశవరావుకు రక్షణగా దాదాపు 50 మంది సాయుధ మావోయిస్టులు ఉంటారని, కానీ ఎన్‌కౌంటరులో 27 మందే చనిపోయారని చెబుతుండటంపై తమకు సందేహాలు ఉన్నాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. కేశవరావును పడుకోబెట్టిన ప్రదేశంలో ఉన్న ఆకులను గమనిస్తే ఎదురుకాల్పులు జరిగినట్టుగా అనిపించడం లేదని చెబుతున్నారు. అత్యంత సమీపం నుంచే నంబాల కేశవరావుపై కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానం వెలిబుచ్చుతున్నారు. నంబాల కేశవరావు(Keshava Rao Encounter) సహా చనిపోయిన వారి ముఖాలపై తుపాకీ బానెట్‌తో కొట్టినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
Also Read :Rohingyas : నడి సముద్రంలో మునిగిన ఓడలు.. 427 మంది మృతి
ప్రజా సంఘాల నేతల అనుమానాలివీ..
- పోలీసులు విడుదల చేసిన నంబాల కేశవరావు ఫొటోలలో ఆయన గడ్డం చేసుకోనట్లుగా ఉంది. తలకు రంగువేసుకున్నట్లు కనిపిస్తోంది. తల కింద ఎర్రదస్తీ ఉంది. ఇవన్నీ తమకు సందేహం కలిగిస్తున్నాయని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు.
- నంబాల కేశవరావు దస్తీ ఎప్పుడూ అలా వాడరని, దాన్ని కొత్తగా కట్టినట్లుగా ఉందని గతంలో కేశవరావుతో కలిసిపనిచేసిన పలువురు మాజీ మావోయిస్టులు చెబుతున్నారు.
- కేశవరావుతో పాటు మరో మావోయిస్టు నేత మధు తప్పనిసరిగా ఉంటాడని.. ఈ ఇద్దరికి రక్షణగా మరికొందరు ఉంటారని చెబుతున్నారు. వాళ్లంతా ఏమై ఉంటారని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
- కేశవరావు అనారోగ్యంతో చికిత్స తీసుకుంటుండగా, పట్టుకొచ్చి కాల్చిచంపారన్న ఆరోపణలు వినినిపిస్తున్నాయని అంటున్నారు.
- కేశవరావు గత పదేళ్లుగా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని అబూజ్ మడ్‌లో ఉన్న ఒకే ప్రాంతంలో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈవిషయం తెలియబట్టే ఆయనను ఎన్‌కౌంటర్ చేసి ఉంటారని అంటున్నారు.
- ఈ నెల 21న నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగింది. ఆయన మృతదేహం కోసం ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. మరణించి మూడు రోజులు అవుతున్నా మృతదేహం అప్పగించకపోవడంపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.