By: డా.ప్రసాదమూర్తి
Pawan Kalyan: అటు చూస్తే బాదం హల్వా.. ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ.. ఎంచుకునే సమస్య ఎదురయిందో ఉద్యోగికి. ఇవి మహాకవి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోని వాక్యాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే ఈ కవితా పంక్తులు గుర్తుకొస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో అనుకోకుండా తన చేతికి చిక్కిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకూడదన్న జాగరూకత జనసేనాని పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు అనంతరం తెలుగుదేశం పార్టీ గందరగోళ పరిస్థితుల్లో పడిపోయిన సందర్భంలో, మొత్తం ప్రతిపక్షమే ఆంధ్రప్రదేశ్ లో అంతరించిపోతుందా.. వచ్చే ఎన్నికల్లో జగన్ కి అడ్డే లేదా.. అనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, పవన్ పక్కా వ్యూహంతో నడుం బిగించి రణరంగంలోకి దూకాడు.
పవన్ తీసుకున్న సమయస్ఫూర్తితో కూడిన ఈ సకాలచర్య అటు అధికార పార్టీ వైసిపి వర్గాల్లో కలవరాన్ని.. ఇటు జనసేన శ్రేణులు సంతోషాన్ని ఏకకాలంలో కలిగించింది. రెండు బలమైన ఎనుబోతులు కుమ్ములాడుకుంటే మధ్యలో ఒక చిన్న మేకపోతు ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు, పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో అనూప్యమైన పరిణామాల నేపథ్యంలో కీలకంగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు లేకపోతే మరొక సమర్ధుడైన నాయకుడు, పార్టీని విజయ పథంలో నడిపించే నాయకుడు ఎవరూ లేరు అనే సందిగ్ధ స్థితిలో పడిన నేపథ్యంలో నేను ఉన్నాను అనే సంకేతాన్ని పవన్, అటు టిడిపి శ్రేణులకు.. ఇటు ప్రజలకు ఏకకాలంలో అందించారు. రెండవ దశ నాయకత్వం బలంగా లేకపోతే పార్టీలో ఎలాంటి పరిస్థితి వస్తుందో దానికి తెలుగుదేశం తాజా ఉదాహరణ.
Also Read: AP Politics: ఏపీలో వ్యక్తుల చుట్టూ రాజకీయాలు..!
తెలుగుదేశం పార్టీ మాట ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. తొలి నుంచి తాను ఎన్డీఏలో భాగమని చెబుతూ వస్తున్నాడు. మరి తెలుగుదేశంతో తాము పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగుతామని ఆయన బలంగా, స్పష్టంగా చెప్పినప్పుడు బిజెపి ఇంతవరకు ఏమీ స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పెద్దలను ఏపీ రాజకీయాలలో కీలక అంశాలపై ఒప్పించడానికి బయలుదేరుతున్నట్టు మంగళగిరిలో తన పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలకు, నాయకులకు చెప్పారు. దీన్నిబట్టి బిజెపి విషయం ఏమిటో ముందు తేల్చుకుని, ఒకవేళ బిజెపి జగన్ కే అనుకూలంగా ఉంటే, తాను బిజెపితో బంధాలు తెంచుకొని ఏపీలో కమ్యూనిస్టులతో చేతులు కలిపి, తమ కూటమిని మరింత బలోపేతం చేయవచ్చు. పవన్ ముందు ఈ రెండు ఆప్షన్సూ ఉన్నాయి.
అయితే అటు కమలం, లేదంటే ఇటు కామ్రేడ్స్.. మనం పైన చెప్పుకున్నట్టు రెండు ఆప్షన్స్, బాదం హల్వా సేమ్యా ఇడ్లీ లాంటివి కావు. ఈ రెండు పక్షాలకు ఏపీ రాజకీయాల్లో ఓట్లు తీసుకొచ్చేంత బలం ఏమీ లేదు. అయినా ఒక కూటమి కడితే ఆ సంఘటనకు సమకూరే శక్తి, అది ఎన్నికల్లో చూపించే ప్రభావం వేరేగా ఉంటుంది. కాబట్టి పవన్ ఢిల్లీ ప్రయాణం రానున్న ఏపీ రాజకీయాల్లో అతి కీలకం కాబోతోంది. తెలుగుదేశం, జనసేనతో పాటు బిజెపి కూటమి కడితే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆ కూటమిలో చేరవు. అలాగే కమ్యూనిస్టులతో కూటమి కడితే అందులో బీజేపీ చేరదు. రెండిట్లో ఎటువైపు అడుగులు వేయాలో పవన్ కళ్యాణ్ దే ఛాయిస్. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా జనసేన కార్యకర్తలు, నాయకులు ఆమోదముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీలో ఎవరి బలం ఎంత.. ఎవరి ఓటింగ్ శాతం ఎంత.. ఎవరితో కలిసి ఉంటే తమకు లాభం ఎంత.. ఈ అంచనాలతో పవన్ ముందుకు వెళతారు.
పరిణామాలు ఎటు మలుపులు తిరిగినా చంద్రబాబు సుదీర్ఘకాలం జైల్లోనే ఉండాల్సి వస్తే, ప్రతిపక్ష చక్రం తిప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపైనే పడింది. ఈ ఎరుకతోనే పవన్ ముందుకు కదులుతున్నారు. అనుకోకుండా అంది వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో పవన్ ఎంత రాజనీతిని, చతురతను ప్రదర్శిస్తారో చూడాలి.