ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది. మొత్తం 65 అంశాలపై చర్చ జరగనుండగా, వీటిలో పెట్టుబడుల సదస్సు, కొత్త జిల్లాల ఏర్పాటు, తుఫాన్ నష్టపరిహారం, రాజధాని నిర్మాణానికి రుణం వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి. ముఖ్యంగా అమరావతిలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకునే కీలక నిర్ణయాలకు వేదికగా మారనుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Hyderabad : హైదరాబాద్ అడ్డాగా ఉగ్రకుట్రకు ప్లాన్
ముఖ్య ఎజెండాలో విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ముఖ్యాంశంగా నిలిచింది. ఈ సదస్సు కోసం సిఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రులు, అధికారులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. సదస్సులో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు పాల్గొనే అవకాశం ఉండగా, ఇటీవల అమెరికా, జపాన్ పర్యటనలలో సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పరిశ్రమల వేత్తలను ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపరిహారం, పునరావాస చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం NaBFID బ్యాంక్ నుండి రూ.7,500 కోట్లు రుణం తీసుకునే అంశం కూడా ఆమోదం పొందనుంది.
ఇదిలా ఉండగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి చర్చకు రానుంది. పాలనా సౌలభ్యం దృష్ట్యా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, కొన్నిచోట్ల మండలాలను పునర్‌వ్యవస్థీకరించడం వంటి ప్రతిపాదనలు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాబినెట్ సబ్‌కమిటీ ఈ అంశంపై నివేదిక సమర్పించగా, దానిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీల ప్రకారం కొత్త జిల్లాల రూపకల్పన జరిగే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద రాష్ట్ర భవిష్యత్ పరిపాలనా, ఆర్థిక దిశను నిర్ణయించే ఈ క్యాబినెట్ సమావేశం పలు చారిత్రాత్మక నిర్ణయాలకు సాక్ష్యం కానుంది.
