Sensational Decision : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం(Sensational Decision) తీసుకుంది. ఏపీలోని ముగ్గురు ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. అనంతపురం, కృష్ణా, తిరుపతి కలెక్టర్ల మీద ఈసీ బదిలీ వేటు వేసింది. అనంతపురం కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షాలను బదిలీ చేయాలని ఆర్డర్ ఇచ్చింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌ను వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్‌ను కూడా విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిని ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి సీఈసీ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఈసీ ఆదేశాలను ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు పంపారు. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏపీ సీఈవో ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎస్పీలపై బదిలీ వేటు వేస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
పల్నాడు జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం పేరిట ఇటీవల భారీ బహిరంగసభను నిర్వహించాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో నిర్వహించిన ఈ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో తలెత్తిన సెక్యూరిటీ లోపాలపై విపక్షాలు పోలీసులకు, ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేశాయి. మైకులు పదేపదే మొరాయించడం, సాక్షాత్తూ ప్రధాని ప్రసంగానికి ఆటంకాలు కలగడం సహా భద్రతా లోపాలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.
Also Read :Three Women : ఎన్నికల క్షేత్రంలో ముగ్గురు శక్తివంతమైన మహిళలు.. ఎవరో తెలుసా ?
ఈ ఘటనపై ఏపీ సీఈవో నుంచి అందిన నివేదిక మేరకే గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. బదిలీ వేటు వేసిన అధికారులను అందరినీ వేరే అధికారులకు బాధ్యతలు అప్పగించి.. విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.