Site icon HashtagU Telugu

AP Building Structures : ఏపీలో మున్సిపాలిటీల చేతికి భవన నిర్మాణాల అనుమతుల అధికారం

Ap Building Structures

Ap Building Structures

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) భవన నిర్మాణాలు, లేఔట్ల (AP Building Structures)అనుమతుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పట్టణాభివృద్ధి సంస్థ (డీటీసీపీ) ద్వారా ఈ అనుమతులు జారీచేయగా, ఇప్పుడు ఈ అధికారాలను మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, నగర, గ్రామ పంచాయతీలకు బదిలీ చేసింది. ఈ మార్పు వల్ల ప్రజలకు వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. చిన్న లేఔట్లకు, భవన నిర్మాణాలకు సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతుల ప్రక్రియను స్వయంగా నిర్వహించనున్నాయి. అయితే, నగర పంచాయతీల పరిధిలో 3 ఎకరాలపైన ఉన్న లేఔట్లకు మాత్రం డీటీసీపీ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ, ప్రణాళికా అనుసరణకు కీలకమని పేర్కొంది. ఈ మార్పులు ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థలు అనుమతుల విధానాన్ని నిర్వహించడం వల్ల, దరఖాస్తు ప్రక్రియ వేగవంతం అవుతుందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు తగ్గుతాయని నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

Worlds Smartest Pen : న్యూవా పెన్.. పెన్నులో కూడా ఇన్ని ఫీచర్లా ?!

ఈ మార్పులతో స్థానిక సంస్థలు భవన నిర్మాణ అనుమతుల ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు, పంచాయతీలు ఈ ఆదాయాన్ని పట్టణాభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవచ్చు. తగిన పర్యవేక్షణతో ఈ విధానం సమర్థవంతంగా అమలవుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీని ద్వారా భవన నిర్మాణ రంగంలో వేగవంతమైన అనుమతులు పొందడంలో సాయపడతాయని ఒక వర్గం ప్రశంసిస్తోంది. కానీ, తగిన పర్యవేక్షణ లేకుంటే, అక్రమ నిర్మాణాలు, పర్యావరణ సమస్యలు పెరుగుతాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మార్పులు అమలులో ఎంతవరకు సమర్థవంతంగా ఉంటాయో వేచి చూడాలి.