Site icon HashtagU Telugu

Amaravathi : ద్వారకాతిరుమల వద్ద మహా పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు..!!

Amaravthi

Amaravthi

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఈ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని అమరావతి టు అరసవల్లి పేరుతో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఈ రోజు 21వ రోజుకు చేరింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చేరుకున్న రైతులు చిన్న వెంకన్నస్వామిని దర్శించుకుని, నిన్న అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులర్పించి ఈ ఉదయం పాదయాత్రను ప్రారంభించారు.ద్వారకాతిరుమల గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

ద్వారకాతిరుమల గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతిలేదని వారిని పోలీసులు ఆపారు. గ్రామంలోకి వెళ్లాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. ఉగాది మండపం వద్ద పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. రైతులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారు. కేసులకు భయపడేదే లేదంటూ రైతులు తోసుకుంటూ ముందుకు సాగారు.