Dasari Gopikrishna : గత శుక్రవారం(జూన్ 21న) రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో ఉన్న ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ(32) ప్రాణాలు కోల్పోయాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ(Dasari Gopikrishna)ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితమే ప్రవలికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇంకా ఆయన భౌతిక కాయం అమెరికాలోనే ఉంది. దాన్ని ఇవాళ సాయంత్రం భారత్‌కు పంపించే అవకాశం ఉంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, గోపీకృష్ణ స్నేహితులు భారత కాన్సులేట్ సహకారంతో అతడి మృతదేహాన్ని బాపట్లలోని స్వగ్రామం యాజలికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు ఈ కాల్పుల ఘటనపై పోలీసులు నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన కొత్త అప్‌డేట్ బయటికి వచ్చింది. ఆ స్టోర్‌లో పనిచేస్తున్న గోపీకృష్ణ సహా దాదాపు 13 మందిపై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి పేరు దావొంట మాథిస్ అని.. వయసు 21 ఏళ్లు ఉంటుందని తెలిసింది. ఇతగాడు గన్‌తో గోపీకృష్ణ తలపై అనేక సార్లు కాల్చాడని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు. స్టోర్ నుంచి ఫ్రీగా సిగరెట్ ప్యాకెట్‌ను తీసుకెళ్లేందుకు దావొంట మాథిస్ కాల్పులు జరిపి గోపీకృష్ణ సహా మొత్తం ముగ్గురి ప్రాణాలు తీశాడని విచారణలో గుర్తించారు. స్టోర్‌లో కాల్పులు జరిపి, వెళ్లిపోయేటప్పుడు సిగరెట్ ప్యాకెట్లు సహా పలు వస్తువులను దావొంట మాథిస్ తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. దావొంట మాథిస్ క్రిమినల్ రికార్డు ఉందని.. అతడు గతంలోనూ ఈ తరహా దారుణాలకు తెగబడ్డాడని వెల్లడించారు. కాల్పుల్లో ముగ్గురు చనిపోవడంతో దావొంట మాథిస్‌పై క్యాపిటల్ మర్డర్ కేసును నమోదు చేశారు.