ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు డల్లాస్ లో ఘన స్వాగతం లభించింది. ఎన్నారై టీడిపి నాయకులు, అభిమానులు, కూటమి నాయకులు ఇతరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. డల్లాస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు విదేశాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో NDA కూటమి చారిత్రక విజయం వెనుక విదేశీ తెలుగు ప్రవాసుల పాత్ర ఎంతో ఉందని, కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలబడినందుకు ఆయన ప్రవాసులకు కృతజ్ఞతలు అన్నారు. కేవలం NRIలు అనడం కంటే, వీరిని “Most Reliable Indians MRIs)అత్యంత విశ్వసనీయ భారతీయులు” గా లోకేశ్ అభివర్ణించడం ప్రవాస తెలుగువారిపై ఆయనకున్న గౌరవాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తుంది. తెలుగు డయాస్పోరా తమకు అండగా నిలబడినట్లే, తమ ప్రభుత్వం కూడా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ విజయం కేవలం పార్టీ కార్యకర్తల, నాయకుల కృషి మాత్రమే కాకుండా, విదేశాల నుండి వచ్చిన ఆర్థిక, నైతిక మద్దతు కూడా కీలకమని లోకేశ్ స్పష్టం చేశారు. అందుకే ఆంధ్రలో అయినా, అమెరికాలో అయినా కార్యకర్తే, ప్రవాసులే తమకు అధినేతలు అని ఆయన పేర్కొన్నారు.
Lokesh Dallas2
ఎన్నికల విజయం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తోంది. ఏపీ ఇప్పుడు భారతదేశానికి “వే బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador of Speed)గా మారిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కేంద్రీకృత అభివృద్ధికి స్వస్తి పలికి, రాష్ట్రాన్ని 8 ముఖ్యమైన పారిశ్రామిక, ఆవిష్కరణ జోన్‌లుగా విభజించి వికేంద్రీకృత అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని ఆయన వివరించారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే దాదాపు ₹20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, దీని ద్వారా 16 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని లోకేశ్ వెల్లడించారు. విదేశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ‘కళ్లకు రెక్కలు’ అనే పథకం ద్వారా మద్దతు ఇస్తామని, అలాగే AP NRT ద్వారా విదేశీ తెలుగు ప్రవాసుల కుటుంబాలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువత కేవలం ఉద్యోగాలు వెతుక్కోవడమే కాకుండా, ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుస్థిరత చాలా ముఖ్యమని నారా లోకేశ్ పేర్కొన్నారు. NDA కూటమి రాష్ట్రంలో రాబోయే 15 సంవత్సరాల పాటు సుస్థిరమైన రాజకీయ స్థిరత్వాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దీర్ఘకాలిక స్థిరత్వం రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు, నిరంతర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని వివరించారు. అభివృద్ధి అగ్ర ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేస్తూనే, గతంలో మహిళలను అవమానించిన వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అంటే, అభివృద్ధి ఒక్కటే కాకుండా, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, సామాజిక న్యాయానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన సంకేతం ఇచ్చారు. నవశకానికి నాంది పలికిన ఈ ప్రభుత్వంలో, ప్రవాసులు, యువత చురుకైన భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు.
