Site icon HashtagU Telugu

AP MLC Polls: ఏపీ ఎమ్మెల్సీ పోల్స్.. ప్రధాన పోటీ ఈ అభ్యర్థుల మధ్యే

Andhra Pradesh Mlc Elections Ap Mlc Polls Tdp Ysrcp Janasena

AP MLC Polls: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగబోతోంది. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల స్థానంలో 35 మంది, కృష్ణా-గుంటూరు స్థానంలో 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది పోటీలో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ పోల్స్‌లో ప్రధాన అభ్యర్థులు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Gold Card : అమెరికా పౌరసత్వం కోసం గోల్డ్​ కార్డ్​.. రూ.43 కోట్లు చాలు !

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఏపీటీఎఫ్‌ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు  టీడీపీ, జనసేన మద్దతు తెలిపాయి. బరిలోంచి వైదొలగిన సుంకరి శ్రీనివాసరావు కూడా రఘువర్మకు మద్దతుగా నిలిచారు. కొందరు బీజేపీ నేతలు పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకు  మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికలకు వైఎస్సార్ సీపీ దూరంగా ఉంది. యూటీఎఫ్‌ నుంచి కోరెడ్ల విజయగౌరి పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో యూటీఎఫ్‌ బలంగా ఉంది. విజయగౌరి, గాదె శ్రీనివాసులునాయుడు ఒకే సామాజికవర్గానికి చెందినవారు.

Also Read :Legislative Council : శాసనమండలి ఎవరి కోసం ? రిజర్వేషన్లు ఉంటాయా ?

ఉమ్మడి ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానపోటీ పేరాబత్తుల రాజశేఖరం (అధికార కూటమి), డీవీ రాఘవులు (పీడీఎఫ్‌) మధ్య ఉంది. రాజశేఖరం టీడీపీ నేత. ఆయనకు జనసేన,  బీజేపీ మద్దతు ఉంది. పీడీఎఫ్‌ అభ్యర్థి డీవీ రాఘవులుకు సీపీఎం, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతు ఉంది. ఈయనకు వైఎస్సార్ సీపీ అంతర్గతంగా మద్దతు ఇస్తోంది.

కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానం   

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో(AP MLC Polls) ప్రధాన పోటీ కేఎస్‌ లక్ష్మణరావు (పీడీఎఫ్‌), ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (అధికార కూటమి) మధ్య ఉంది. మాజీమంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పీడీఎఫ్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కేఎస్‌ లక్ష్మణరావుకు ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు ఉంది. ఆయనపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేవు.