Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!

విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రివర్యులు ప్రసంగిస్తూ సమాజంలో మార్పు తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక విలువల విద్యపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘విలువల విద్యా సదస్సు’ సందర్భంగా భావోద్వేగపూరితమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh), ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ నిర్మలమైన సంతోషంతో అందరినీ ఆకట్టుకున్నారు.

మంత్రి నిర్మలమైన చిరునవ్వు

వెంకటాపురం ఎంపీపీఎస్‌కు చెందిన ముగ్గురు పసి విద్యార్థులు ధైర్యంగా మంత్రి వద్దకు చేరుకున్నారు. తమ డీఈఓ ప్రోత్సాహంతో ఎటువంటి భయం లేకుండా లోకేష్‌ని కలుసుకున్న పిల్లలు ఆయన అడిగిన ప్రశ్నకు తమ స్కూల్ పేరు, ఊరి పేరు స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా సరస్వతి విగ్రహం పూజ పూర్తయ్యే వరకు మంత్రి ముందు చాలా నిశ్శబ్దంగా, హుందాగా నిలబడటం అందరి దృష్టిని ఆకర్షించింది. స్కూల్‌కు బడి తోటను ఏర్పాటు చేయడంలో కృషి చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నంబూరి మనోజ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ముగ్గురు విద్యార్థులు చాగంటి కోటేశ్వరరావు ముందు మల్లెమాల పద్యం చెబుతామని బయలుదేరారని తెలిపారు.

Also Read: Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

‘బాల రైతులు’ ఇచ్చిన బడి తోట కానుక

దారి పొడవునా పిల్లలు “మేమ్ మన అరటి గెల, కూరగాయలు సార్‌కు ఇద్దాం. సార్ చాలా మంచోళ్ళు” అని చెబుతూ వచ్చారు. వారు గతంలో తాము పండించిన పంటను ట్వీట్ చేసినప్పుడు మంత్రి వారిని బాల రైతులుగా గుర్తించారో లేదో తెలియదు కానీ చిన్నారులు తెచ్చిన బడి తోట పంట కానుక మంత్రి మనసును గెలుచుకుంది.

ఉపాధ్యాయురాలు మనోజ మాట్లాడుతూ.. “తమ హోదాను చూపకుండా, మెత్తని మాట, నిర్మలమైన నవ్వుతో బిడ్డలను ఆప్యాయంగా హత్తుకున్న మంత్రివర్యులు మాకు దొరకడం మా అదృష్టం. ఆయన ఉపాధ్యాయుల కష్టాన్ని గుర్తిస్తున్న సహృదయులు. ఈ రోజు నాకు, పిల్లల తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంది” అని కృతజ్ఞతలు తెలియజేశారు.

మనోజ నంబూరి కృషికి అభినందనలు

వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్ నంబూరి మనోజ కృషిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. “బడిని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది, ఆకుపచ్చని కల సాకారం చేస్తున్న మనోజ నంబూరి కృషికి జేజేలు. ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థులతో కలిసి తోట పెంపకం ఒక అలవాటుగా చేసుకున్న మనోజ అభినందనీయులు” అని కొనియాడారు. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని, బడి తోటలో పండించిన కూరగాయలను, పండ్లను విద్యార్థులు పంచుకోవడం, మధ్యాహ్న భోజనంలో ఉపయోగించడం మంచి సంప్రదాయం అని మంత్రి పేర్కొన్నారు.

విలువల విద్యా సదస్సులో కీలక నిర్ణయాలు

విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రివర్యులు ప్రసంగిస్తూ సమాజంలో మార్పు తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక విలువల విద్యపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని కేబినెట్ ర్యాంకుతో నియమించడం ఒక పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు.

  Last Updated: 25 Nov 2025, 03:16 PM IST