రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన “టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాం” అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.
కార్యకర్తల ఆరోగ్యమే పార్టీ బలం
రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నేతృత్వంలో, యువ నాయకులు డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల రూపకల్పన చేసిన ఈ సంక్షేమ కార్యక్రమం కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుండి ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 9 లక్షల రూపాయల విలువైన వైద్య సహాయం అందించారు. పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో 20 శాతం వరకు రాయితీ కల్పించడం ద్వారా సుమారు 800 మంది కార్యకర్తలు లబ్ధి పొందారు. “కార్యకర్త ఆరోగ్యంగా ఉంటేనే పార్టీ ఆరోగ్యంగా ఉంటుంది” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను చాటి చెబుతోంది.
రికార్డు స్థాయిలో ఉచిత రక్త పరీక్షలు
గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ఉచిత రక్త పరీక్షల శిబిరం కార్యకర్తలకు భారీ ఆర్థిక వెసులుబాటును కల్పించింది. సాధారణంగా ఒక్కొక్కరు బయట చేయించుకుంటే రూ. 4,600 పైచిలుకు ఖర్చయ్యే పరీక్షలను, 710 మంది కార్యకర్తలకు ఉచితంగా నిర్వహించారు. దీని ద్వారా సుమారు 36 లక్షల రూపాయల మేర కార్యకర్తలకు లబ్ధి చేకూరింది. నియోజకవర్గ స్థాయిలోనే ఇంత పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించడం పట్ల పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిఎం ఆదేశాలు
రాజమండ్రి రూరల్ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఈ మేరకు డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల గారిని ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఎలా తీసుకువెళ్లాలనే దానిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కోరారు. త్వరలోనే పార్టీ పరంగా కార్యకర్తలందరికీ ఇలాంటి వైద్య భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరియు పార్టీ యంత్రాంగం అడుగులు వేయనుంది.
